World Bank-AIIB Investments: కేంద్రం తాజా వైఖరితో ఏపీకి విదేశీ పెట్టుబడులు, రుణాలు వచ్చినట్టేనా?-will foreign investments and funds come to ap with the latest attitude of the centre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  World Bank-aiib Investments: కేంద్రం తాజా వైఖరితో ఏపీకి విదేశీ పెట్టుబడులు, రుణాలు వచ్చినట్టేనా?

World Bank-AIIB Investments: కేంద్రం తాజా వైఖరితో ఏపీకి విదేశీ పెట్టుబడులు, రుణాలు వచ్చినట్టేనా?

Sarath chandra.B HT Telugu
Jul 24, 2024 09:27 AM IST

World Bank-AIIB Investments: ఐదేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో పెట్టుబడులను ప్రపంచ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉపసంహరించుకున్నాయి. తాజాగా కేంద్రం వైఖరితో అప్పులు, పెట్టుబడులపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కేంద్రం నిర్ణయంతో ఏపీకి పెట్టుబడులు వచ్చినట్టేనా?
కేంద్రం నిర్ణయంతో ఏపీకి పెట్టుబడులు వచ్చినట్టేనా?

World Bank-AIIB Investments: సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై నెలలో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించు కున్నాయి. 2019లో ఏపీ అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్రం ఆలోచనలు నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

2014-18 మధ్య ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 2018లో జరిగిన నాటకీయ పరిణామలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోపే ఏపీ రాజధానికి ఆర్ధిక సాయం అందించే ప్రాజక్టు నుంచి ప్రపంచబ్యాంకు వైదొలగింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై 21న కేంద్రప్రభుత్వం సిఫార్సును ఉపసంహరించు కోవడంతో అమరావతి ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించడాన్ని ప్రపంచ బ్యాంకు నిలిపివేసింది.

అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు విరమించుకున్నట్లు 2019లో జూలైలో మూడో వారంలో ప్రకటించింది. ఆ నిర్ణయం వెలువడిన రెండు రోజుల తర్వాత, అమరావతి ప్రాజెక్టును విరమించుకోవడానికి గల కారణాలను ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.

2019 జులై 18న ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఎలాంటి కారణాలు చూపకుండానే అమరావతి ప్రాజెక్ట్‌ను ‘డ్రాప్‌’ చేసినట్లు పేర్కొంది. “అమరావతి సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ASIIDP)” మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 715 మిలియన్ డాలర్లలో, 300 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయంగా అందించడానికి ముందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. మిగిలిన మొత్తాన్ని ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(AIIB) రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది.

వైసీపీ అధికారంలోకి రాగానే “ప్రతిపాదిత అమరావతి సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి ఫైనాన్సింగ్ కోసం ప్రపంచ బ్యాంకుకు చేసిన అభ్యర్థనను 2019 జూలై 15న భారత ప్రభుత్వం ఉపసంహ రించుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపాదిత ప్రాజెక్ట్ మనుగడలో ఉండదని ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డుకు సమాచారం అందినట్టు’’ అని ప్రపంచ బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.

అదే సమయంలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం మరియు విపత్తు నిర్వహణ రంగాలను కవర్ చేసే 1 బిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌తో ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతునిస్తున్నట్టు అప్పట్లో ప్రపంచబ్యాంకు ప్రకటన పేర్కొంది. 2019 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగం కోసం 328 మిలియన్ డాలర్ల సాయం కోసం ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకుంది.

ప్రపంచ బ్యాంకు బాటలోనే ఆసియన్ బ్యాంక్…

ప్రపంచ బ్యాంకు అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగినట్టు ప్రకటించిన రెండ్రోజులకే ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చైనా ప్రధాన కార్యాలయంగా ఉన్న AIIB ఏపీ కొత్త రాజధాని నగర నిర్మాణ ప్రాజెక్ట్-అమరావతికి ఆర్థిక సహాయం నుండి వైదొలిగిన ఐదేళ్లకు అదే రోజు పార్లమెంటులో రూ.15వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ఏజెన్సీల నుంచి అందించనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అమరావతిలో ఐదు భాగాలలో కీలకమైన మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను నిర్మించడానికి ప్రపంచబ్యాంకుతో పాటు AIIB సంయుక్తంగా 715 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని అందించాలని నిర్ణయించాయి.

ఇందులో ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ USDలను ఆర్థికంగా అందించాల్సి ఉండగా, AIIB 200 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వాల్సి ఉంది. 'అమరావతి సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్' మొత్తం వ్యయంలో ఈ రుణం 28 శాతంగా ఉంది.

మాస్టర్‌ ప్లాన్ కోసమే నిధులు…

అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ కింద రోడ్ నెట్‌వర్క్‌లో భాగంగా 92.2 కి.మీ హై స్పీడ కారిడార్‌ నిర్మాణానికి ఈ నిధులు సమకూర్చుకోవాలని భావించారు. ఇందులో నీరు, మురుగునీరు, డ్రైనేజీ, కమ్యూనికేషన్‌లు మరియు డక్ట్‌లు వంటి అనుబంధ యుటిలిటీ కారిడార్‌ల నిర్మాణం ఉంటుంది. కాలిబాటలు, సైక్లింగ్ మార్గాలు మరియు వీధి దీపాలు, రహదారి భద్రత నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు మరియు రహదారి భద్రతా ప్రణాళికను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలు పెట్టుకున్నారు.

కేంద్రం నిర్ణయంతో ఉపశమనం…

ఐదేళ్ల క్రితం అమరావతి ప్రాజెక్టు నుంచి కేంద్రం ఉపసంహరించుకోవడం ఏపీ బ్రాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రుణాలిచ్చే సంస్థలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం కోల్పోడానికి కారణమైంది. రాజధాని నిర్మాణంతో పాటు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు జంకే పరిస్థితి ఏర్పడింది. పరిపాలన వికేంద్రీకరణకు వైసీపీ మొగ్గు చూపినా మొత్తంగా చూస్తే ఏపీ అంటేనే పెట్టుబడిదారులు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తాయి.

కేంద్రం వివిధ ఏజెన్సీల ద్వారా రూ.15వేల కోట్ల రుపాయలను రాజధాని నిర్మాణానికి అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం గ్రాంటుగా ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పినా, ఏజెన్సీల ద్వారా అందిస్తామని చెప్పడం ద్వారా అమరావతిలో ప్రపంచ స్థాయి రుణ సంస్థలు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. విదేశీ రుణ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్డడానికి ముందుకు వస్తే మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామక రంగంలో కూడా కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం