CBN Delhi Tour: అంతు చిక్కని అంతరంగాలు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రహస్యం ఏమిటి?-what is the secret of chandrababus trip to delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Delhi Tour: అంతు చిక్కని అంతరంగాలు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రహస్యం ఏమిటి?

CBN Delhi Tour: అంతు చిక్కని అంతరంగాలు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రహస్యం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Jun 05, 2023 12:26 PM IST

CBN Delhi Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హడావుడిగా ఢిల్లీ వెళ్లొచ్చారు. కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. భేటీ తర్వాత రెండు పార్టీలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాజకీయంగా మరింత ఆసక్తి పెరిగింది.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

CBN Delhi Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు అనుకూల మీడియాలో సాధారణంగా ఉండే హడావుడి ఈ దఫా కనిపించలేదు. నామమాత్రపు వార్తలకే బాబు ఢిల్లీ టూర్‌ను పరిమితం చేశారు. నాలుగైదు నెలలుగా చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నా అవి ఫలించలేదని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఉంది. అనూహ్యంగా చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌ మెంట్ ఖరారు కావడంతో ఇక పొత్తు చిగురించడమే తరువాయి అన్నట్లు టీడీపీ శిబిరం ప్రచారం చేస్తోంది.

దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుతో సమావేశం కావడం ఇదే మొదటి సారి. అమిత్ షా పర్యటనలో నిరసనలు, మోదీకి వ్యతిరేకంగా ఘాటైన విమర్శలు చేసిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

ఎన్నికలు మరో ఏడాదిలో ఉండటంతో భవిష్యత్ అవసరాల కోసమే చంద్రబాబు అమిత్‌షాతో భేటీ అయ్యారనేది స్పష్టం. తాజా భేటీలో రాజకీయ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని టీడీపీ వర్గాలు కూడా అంతర్గత చర్చల్లో చెబుతున్నాయి.

ఏపీలో 2024ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే జనసేన పార్టీతో ఇప్పటికే రాజకీయ అవగాహన కుదిరింది. తమ కూటమిలో బీజేపీనికూడా చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అధికార పార్టీని ఓడించడానికి అవసరమైన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని పవన భావిస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు మనసులో ఏముందో ఇప్పటి వరకు బయటపెట్టలేదు. బీజేపీని కలుపుకు పోవాలనే ఆలోచన ఉన్నట్టే కనిపించినా దానిని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబుకు పొత్తులపై ఉన్న రాజకీయ నిబద్దత, విశ్వసనీయత కూడా చర్చనీయాంశమే. రాజకీయాల కోసం ఎవరితోనైనా పొత్తుకు సిద్దపడే గత చరిత్ర పుష్కలంగా ఉంది.

అదే సమయంలో ఏపీలో బలమైన రాజకీయ పక్షంగా ఎదగాలని తపిస్తోన్న బీజేపీకి పొత్తులు ఎంతవరకు లబ్ది చేకూరుస్తాయనే సందేహం కూడా బీజేపీ నేతల్లో ఉంది. దీనికి తోడు విజయాలు వరిస్తే దాన్ని టీడీపీ ఖాతాలో వేసుకోవడం, ఓడిపోతే అది బీజేపీకి ఆపాదించడం వంటి పనులతో చంద్రబాబు వారి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఏమి ఆశించి ఢిల్లీకి వెళ్లారు….

చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తుల కోసం మాత్రమే కాదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఎంత వరకు లబ్ది చేకూరుస్తుందనే సందేహం టీడీపీలో కూడా లేకపోలేదు.

బీజేపీతో పొత్తు కంటే స్నేహం ముఖ్యమైన క్లారిటీ చంద్రబాబుకు రావడం వల్లే ఆ పార్టీ అగ్ర నేతల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏపీలో పరిస్థితి ఉన్న తేడాను గుర్తించడంతోనే బీజేపీతో సయోధ్యకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు.

బీజేపీతో ఘర్షణపూరిత వైఖరి అవలంబించడం వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న అంచనాతోనే చంద్రబాబు ముందస్తుగా బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీపై దూకుడగావెళుతున్నవైసీపీ నుంచి ముప్పు తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీతో పాటు ఆ పార్టీకి అండగా ఉండే వారిని కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టట్లేదు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో దర్యాప్తు సంస్థలు కూడా దూకుడుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత జటిలంగా మారకముందే బీజేపీకి చేరువ కావడానికి టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ వ్యూహం అదే కావొచ్చు…

చంద్రబాబును గతంలో ఎదురైన అవమానాలను తమ పార్టీ ఎప్పటికి మర్చిపోదని బీజేపీ నేతలు తరచూ చెబుతుంటారు. ప్రధానికి, బీజేపికి వ్యతిరేకంగా నల్ల బెలూన్లను ఎగురవేయడంతో పాటు ఢిల్లీలో నీకో భార్య ఉందా? ఇల్లుందా? అంటూ మోదీని నిలదీసిన వైనాన్ని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తుంటారు. రాజకీయాల్లో శాశ్వత మితృత్వం, శాశ్వత శతృత్వం ఉండకపోయినా టీడీపీని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనే ఆలోచన ఆ పార్టీ పెద్దలకు ఉండి ఉండొచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం వైసీపీ బీజేపీ అగ్రనేతల కనుసన్నల్లోనే ఉంది.కాంగ్రెస్‌ పార్టీతో ఆ పార్టీకి ఉన్న విభేదాల నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీతో మైత్రికి ఎలాంటి ఢోకా లేదు. అదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ లాభపడకుండా కట్టడి చేయడంలో భాగంగానే టీడీపీతో సంప్రదింపులు చేసి ఉండొచ్చనే ప్రచారం కూడా ఉంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకున్నా, అవి బీజేపీకి ఉపయోగపడాలనే ఒప్పందానికి కూడా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ తమ పక్షానే ఉంటుంది కాబట్టి టీడీపీని కూడా తమ వైపే ఉండేలా చూడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ అవకాశాలను తగ్గించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుండొచ్చు.

చంద్రబాబు మనసులో ఏముంది…

ఏపీలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. బీజేపీతో పొత్తుతో మైనార్టీ, దళిత ఓట్లు దూరం అవుతాయనే అనుమానం కూడా టీడీపీకి ఉంది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కంటే అవగాహన కుదుర్చుకోవడం మేలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పోటీకి దిగకుండా ఉండటమో, నామమాత్రంగా పోటీ చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు.

అదే సమయంలో బీజేపీ నుంచి ఎన్నికల నిర్వహణలో అవసరమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్ల నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రభుత్వ పరమైన సహకారం కూడా టీడీపీకి అవసరం ఉంటుంది. ఎన్నికల నాటికి వైసీపీ పట్టు బిగించకుండా ఉండేందుకు అవసరమైన సహాయాన్ని బీజేపీ నుంచి కోరవచ్చు.

చంద్రబాబుతో రాజకీయ ఒప్పందాల కంటే రాజకీయంగా చంద్రబాబును వాడుకోవచ్చనే ఆలోచనకు బీజేపీ పెద్దలు కన్విన్స్ అయితే ఇవన్నీ ఫలించే అవకాశం ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలు, వచ్చే ఎన్నికల్లో పార్టీల ప్రభావం, గెలుపొటముల్ని అంచనా వేసి బీజేపీ కూడా టీడీపీకి సహకరించే అవకాశాలు లేకపోలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవన్నీ కొలిక్కి వచ్చే లోపు ఏపీలో టీడీపీ శిబిరాన్ని జగన్ సర్కారు ఊపిరి తీసుకునేలా సాయపడాలని కోరి ఉంటారని అంచనా వేస్తున్నారు. వచ్చే కొద్ది వారాల్లో టీడీపీ అగ్ర నేతలతో పాటు, ఆ పార్టీకి అండగా ఉన్న వారిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందనే ఆందోళనతోనే బీజేపీ పెద్దల్ని ఆశ్రయించారనే ప్రచారం కూడా ఉంది. సిఐడి కేసులతో పాటు, రాజధాని ల్యాండ్ పూలింగ్ అక్రమాలు, ఆర్ధిక వ్యవహారాలు, మార్గదర్శి కేసుల్లో జగన్ దూకుడు ప్రదర్శిస్తారనే అంచనాతోనే అమిత్‌షాను ఆశ్రయించారనే ప్రచారం కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది.

ఒకప్పుడు కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలను శాసించిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తగ్గడానికి కూడా సిద్దమయ్యారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు గత 20-25ఏళ్లలో పొత్తుల్ని, రాజకీయ భాగస్వాముల్ని ఎంత వేగంగా మార్చేశారనే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్న బీజేపీ బాబు విషయంలో ఏం చేస్తుంది అనేదే అసలు ప్రశ్న.

Whats_app_banner