ఉద్యోగాల భర్తీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పని చేసేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మొత్తం 5 ఖాళీలు((BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 )) ఉన్నట్లు వెల్లండించింది. ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులకు ఆగష్టు 29వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ లో ఉదయం 11 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల ఒరిజినల్ , జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్ లేదా కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించవచ్చని వెల్లడించింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో దాతలకు టీటీడీ వసతి లేదని తెలిపింది. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు టీటీడీ అందించే వసతి ఉండదని, ఈ విషయాన్ని గమనించి దాతలు సహకరించాలని కోరింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే సాధారణ భక్తుల వసతికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో దాతలకు ఎటువంటి వసతి కల్పించలేమని టీటీడీ పేర్కొంది. వివిధ ట్రస్టులు, పథకాల ద్వారా తిరుమల శ్రీవారికి దాతలు కానుకలు అందిస్తుంటారు. అయితే సాధారణంగా టీటీడీ దాతలకు తిరుమలలో వసతి కల్పిస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ కారణంగా దాతలకు వసతి సౌకర్యం కల్పించలేమని తెలిపింది. అయితే అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా...బ్రహ్మోత్సవాల సమయంలో దాతలు వారికి ఉన్న విశేషాధికారాల మేరకు దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. దాతలందరూ ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.