UPSC lateral entry: ‘యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ’ నోటిఫికేషన్ పై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వంలో లేటరల్ ఎంట్రీ ప్రక్రియ ద్వారా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఇతర కీలక పదవుల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జారీ చేసిన ప్రకటనను రద్దు చేయాలని సిబ్బంది, శిక్షణ శాఖ (DOPT)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
లేటరల్ ఎంట్రీ ప్రక్రియ ద్వారా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఇతర కీలక పదవుల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జారీ చేసిన ప్రకటనను రద్దు చేయాలని సిబ్బంది, శిక్షణ శాఖ (DOPT)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రీతి సుడాన్ కు రాసిన లేఖలో తెలియజేశారు. ఆర్థిక, ఎలక్ట్రానిక్స్ వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలకు సీనియర్ అధికారులను నియమించే విధానంలో గణనీయమైన మార్పును ప్రధాని (Narendra Modi) నిర్ణయం సూచిస్తుందని ఆ లేఖలో జితేంద్ర సింగ్ వివరించారు.
2018 నుంచి లేటరల్ ఎంట్రీ విధానం
కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టుల భర్తీ కోసం లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2018లో ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఇప్పటివరకు 63 నియామకాలు జరిగాయి. వీటిలో 35 ప్రైవేట్ రంగం నుండి ఉన్నాయి. వీరిలో 57 మంది ఇప్పటికీ ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
‘ఆధార్’ చైర్మన్ కూడా..
లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రభుత్వంలో అవసరమైన పొజిషన్లలో నియామకాలు చేపట్టాలని 2005లో రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్, 2013లో ఆరో వేతన సంఘం సిఫారసు చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ పద్ధతి మొదలైందని, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చైర్మన్ గా నందన్ నీలేకని సహా కీలక నియామకాలు ఈ విధంగానే జరిగాయని జితేంద్ర సింగ్ అన్నారు.
రిజర్వేషన్లు ఫాలో కావాలి..
‘‘ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు మా సామాజిక న్యాయ చట్రంలో ఒక మూలస్తంభం, ఇది చారిత్రక అన్యాయాలను పరిష్కరించడానికి, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అమల్లోకి వచ్చింది. అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ సర్వీసుల్లో తగిన ప్రాతినిధ్యం లభించేలా సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ ఆదేశాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందనేది ప్రధాని మోదీ ఉద్దేశం’’ అని జితేంద్ర సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఈ పదవులు ప్రత్యేకమైనవి, సింగిల్ కేడర్ పోస్టులు. అందువల్ల వీటికి రిజర్వేషన్ నిబంధన వర్తించదు. కానీ, సామాజిక న్యాయంపై ప్రధాని దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి సంస్కరించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.
లేటరల్ ఎంట్రీ యాడ్ లో ఏముంది?
ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ లా, డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, ఎకనామిక్ అఫైర్స్, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ వంటి విభాగాల్లో సంయుక్త కార్యదర్శి పోస్టులను లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ఆగస్టు 17న విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉక్కు, పునరుత్పాదక ఇంధనం, పాలసీ అండ్ ప్లానింగ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వంటి మంత్రిత్వ శాఖల్లో కూడా ఈ పదవులు ఉన్నాయి. వాతావరణ మార్పులు, అడవులు, సమీకృత పోషకాల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, వర్షాధార వ్యవసాయ విధానాలు, సేంద్రియ వ్యవసాయం సహా వివిధ విభాగాల్లో డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.