Visakha Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- వాల్తేరు డివిజన్ లో 6 రైళ్లు రద్దు, 4 రైళ్లు రీషెడ్యూల్
Visakha Trains Cancelled : విశాఖ వాల్తేరు డివిజన్ లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు పలు రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
Visakha Trains Cancelled : విశాఖ వాల్తేరు డివిజన్‌లో భద్రతా పనులు కారణంగా పలు రైళ్లను రద్దు అయ్యాయి. మరికొన్ని రైళ్లు రీ షెడ్యూల్ చేశారు. ఈనెల 27న వాల్తేర్ డివిజన్‌లోని పుండి-నౌపడ మెయిన్ లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు, ఇతర భద్రత సంబంధిత ఆధునికీకరణ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్‌ల కారణంగా రైలు సర్వీసులు ప్రభావితం కానున్నాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. అయితే ఇప్పటికే విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, మహబుబ్‌నగర్ ప్రాంతాలకు వెళ్లే 15 రైళ్లను దాదాపు 45 రోజుల పాటు రద్దు చేశారు. తాజాగా విశాఖపట్నం నుంచి ఒడిశా, శ్రీకాకుళం వెళ్లే ఆరు రైళ్లును రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
ఆరు రైళ్లు రద్దు
ఈనెల 27న పలాస నుంచి బయలుదేరే పలాస-విశాఖపట్నం ప్యాసింజర్ (07471), విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ (07470), విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం-గుణపూర్ ప్యాసింజర్ (08522), గుణుపూర్ నుంచి బయలుదేరే గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ (08521), కోరాపుట్ నుంచి బయలుదేరే కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08545), విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం - కోరాపుట్ ప్యాసింజర్ స్పెషల్ (08546) రద్దు చేసినట్లు విశాఖపట్నం రైల్వే కార్యాలయం తెలిపింది.
నాలుగు రైళ్లు రీషెడ్యూల్
ఈనెల 27న పూరీ-గుణపూర్ ఎక్స్‌ప్రెస్ (18417) షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరే బదులు, మధ్యాహ్నం 2:00 గంటలకు పూరి నుంచి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు. భువనేశ్వర్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12830) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరడానికి బదులుగా, మధ్యాహ్నం 3.10 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు. రాయ్‌పూర్-విశాఖపట్నం (08527 ) ప్యాసింజర్ ఉదయం 05.20 గంటలకు బయలుదేరడానికి బదులుగా ఉదయం 07.20 గంటలకు రాయ్‌పూర్‌లో బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు. టాటానగర్ - ఎర్నాకులం (18189 ) ఎక్స్‌ప్రెస్ ఉదయం 05.15 గంటలకు బయలుదేరడానికి బదులుగా ఉదయం 07.15 గంటలకు టాటానగర్‌లో బయల్దేరేలా రీషెడ్యూల్ చేశారు.
ఇక నుంచి ప్రతి రోజూ వివేక్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగర్-కన్యాకుమారి-దిబ్రూగర్ వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ప్రతి రోజు అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, దిబ్రూగఢ్-కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ (22504/22503) ఫ్రీక్వెన్సీని వారానికి 5 రోజుల నుంచి డైలీకి పెంచాలని నిర్ణయించారు. దిబ్రూగఢ్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (22504) జులై 8 నుంచి ప్రతిరోజూ దిబ్రూగఢ్ నుంచి బయలుదేరుతుంది. తిరిగి కన్యాకుమారి-దిబ్రూగఢ్ (22503) వివేక్ ఎక్స్‌ప్రెస్ జులై 12 నుంచి ప్రతిరోజూ కన్యాకుమారి నుంచి బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు