జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు
జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు 47 రోజుల పాటు రద్దు అయ్యాయి. జూన్ 24 నుంచి ఆగస్టు 11 వరకు రైళ్లు రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
జూన్ 24 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు 47 రోజుల పాటు రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖటప్నం నుంచి హైదరాబాద్ (లింగంపల్లి), హైదరాబాద్ (లింగంపల్లి) నుంచి విశాఖపట్నం ప్రతి రోజు రెండు సర్వీసులు ఉండేవి.
అలాగే రత్నాచల్ సుపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ రోజుకు రెండు సర్వీసులు ఉండేవి. సింహాద్రి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి గుంటూరు, గుంటూరు నుంచి విశాఖపట్నం రోజుకు రెండు సర్వీసులు ఉండేవి.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వే భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరగడంతో గుంటూరు-రాయగాడ ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు-విశాఖపట్నం ఫాస్ట్ పాసింజర్ తరచుగా రద్దు చేసేవారు. కానీ పెద్దగా ప్రయాణికులు ఇబ్బంది పడేవారు కాదు. ఎందుకంటే జన్మభూమి, రత్నాచల్ సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని కూడా నిలిపి వేశారు.
విశాఖపట్నం నుంచి అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి రైళ్లలోనే ప్రయాణం చేస్తారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, తీర్థ యాత్రలకు వెళ్లేవారికి ఈ రైళ్లే ప్రధాన రవాణ సాధనం.
- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు