Visakha News : విశాఖ లాడ్జిలో కేరళ వైద్య విద్యార్థిని సూసైడ్, ప్రేమ వ్యవహారమే కారణమా?
Visakha News : విశాఖలో ఓ లాడ్జిలో కేరళకు చెందిన వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Visakha News : కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువతి విశాఖలోని లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ టూ టౌన్ సీఐ తిరుమలరావు తెలిపిన వివరాలు ప్రకారం... విశాఖ డాబా గార్డెన్స్ లోని ఓ లాడ్జికి ఈనెల 23న రమేష్‌కృష్ణ (25) అనే యువతి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూమ్ తీసుకుంది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరకు ఆమె గది నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసుల సమక్షంలో గది తలుపులు బద్దలుగొట్టగా యువతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ లేఖ దొరికింది. తనకు జీవితంపై విరక్తి కలిగిందని, తన చావుకు ఎవరూ కారణం కాదని, సారీ అమ్మా అంటూ యువతి సూసైడ్ లేఖలో రాసింది. రమేష్‌కృష్ణ చైనాలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. యువతి మృతి విషయాన్ని కేరళలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడితో మనస్పర్థలు!
విశాఖలో మెడికల్ స్టూడెంట్ రమేష్ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం ఆత్మహత్యకు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి వాట్సప్ చాట్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే సూసైడ్ కు కారణమని పోలీసులు తేల్చారు. యువతి రమేష్ కృష్ణ ఈ నెల 23న విశాఖకు వచ్చారు. అంతకు ముందే ఇండోర్‌లో ఉన్న తన లవర్ ను కలిసింది. రమేష్ కృష్ణ చైనాలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతుంది. ఆమె స్వస్థలం కేరళలోని త్రిశూర్ జిల్లా వందనపల్లి మండలంగా తెలుస్తోంది. ఇంట్లో చైనా వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన రమేష్ కృష్ణ, విశాఖ నుంచి సింగపూర్‌కు ఫ్లైట్‌లో వెళ్లడానికి డాబా గార్డెన్‌లోని ఓ లాడ్జిలో దిగింది.
ఈ నెల 24న రమేష్ కృ ష్ణ చెక్ అవుట్ చేయాల్సి ఉండగా యువతి గది నుంచి బయటకు రాలేదు. లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి చూడగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. యువతి మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.