Sankalpa SIddhi : చదివింది ఐదో తరగతి... వందల కోట్లు కొట్టేశాడు....-vijaywada police arrests sankalp siddhi multi level marketing scheme organizers for cheating public ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankalpa Siddhi : చదివింది ఐదో తరగతి... వందల కోట్లు కొట్టేశాడు....

Sankalpa SIddhi : చదివింది ఐదో తరగతి... వందల కోట్లు కొట్టేశాడు....

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 06:31 AM IST

Sankalpa SIddhi అతను చదివింది ఐదో తరగతి.... 25ఏళ్ల క్రితం ఓ సంస్థలో స్వీపర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. మెల్లగా మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవహారాల్లో ఆరితేరిపోయాడు.చివరకు ఏడాది వ్యవధిలోనే వందల కోట్లు కొట్టేశాడు. విజయవాడ వెలుగు చూసిన మల్టీ లెవల్ మార్కెటింగ్‌ స్కీం వ్యవహారంలో పోలీసులు కీలక నిందితుల్ని అరెస్ట్‌ సందర్భంగా ఈ మోసం వెలుగు చూసింది. మరోవైపు కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రుపాయలు దోచుకున్న వారికి సహకరించిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయవాడలో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంకల్ప్ సిద్ధి స్కీం నిందితులు
విజయవాడలో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంకల్ప్ సిద్ధి స్కీం నిందితులు

Sankalpa SIddhi జనం ఆశే అతనికి పెట్టుబడి... మాటలతో కోటలు కట్టేసి ఏడాదిలోనే కోట్లు కొల్లగొట్టేశాడు. గుంటూరుకు చెందిన గుత్తా గోపాలకృష్ణ ఏడాది క్రితం సంకల్ప్‌ సిద్ధి ఈ కార్డ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీం ప్రారంభించాడు. ఈ సంస్థ వ్యవహారాలపై ఇటీవల కథనాలు వెలువడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి కొందరు ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల అండతోనే ఏడాదిలో దాదాపు వెయ్యి కోట్ల రుపాయలు కొట్టేశారని టీడీపీ ఆరోపించింది.

విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో గతేడాది కార్యాలయాలు తెరిచి జనం నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు 150-170 కోట్ల రుపాయలు వసూలు చేసి ఉంటారని విజయవాడ సీపీ కాంతిరాణా చెప్పారు. వాస్తవానికి ఈ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. విజయవాడలో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులపై ప్రస్తుతం ఐదు కేసులు నమోదు చేశారు.ప్రైజ్ అండ్ చిట్‌ఫండ్‌ మనీ యాక్ట్‌, డిపాజిటర్ల ప్రొటెక్షణ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు కేవలం ఆర్వోసి వద్ద కంపెనీ రిజిస్టర్ చేసి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ప్రజల్ని బురిడీ కొట్టించారు.

అనుభవంతో పక్కాగా మోసాలు…

విజయవాడకు చెందిన గుత్తా గోపాలకృష్ణ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని తమ్ముడు బళ్లారికి చెందిన గుత్తా కిషోర్‌ అతనికి సాయం చేశాడు. గంజాల లక్ష్మీ, జాకీర్ హుస్సేన్, వెంకట లక్ష్మీ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదో తరగతి మాత్రమే చదువుకున్న గోపాలకృష్ణ తొలినాళ్లలో బెంగుళూరు, హైదరాబాద్‌లలో చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవాడు.

1998లో క్వాంటమ్‌ కంపెనీలో మార్కెటింగ్ చేసి కమిషన్ తీసుకునే వాడు. క్వాంటమ్ కంపెనీపై కేసులు నమోదు కావడంతో అది మూతబడింది. ఆ సమయంలోనే మనీ సర్క్యులేషన్ స్కీంలపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకపోవడంతో కొంత లారీ క్లీనర్‌గా, స్వీపర్‌గా, సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశాడు. ఆ సమయంలో డబ్బులు సరిపోక పోవడంతో ఎన్‌ మార్ట్‌, ఫ్యూచర్ మల్టీ లెవల్ మార్కెటింగ్‌ వంటి సంస్థల్లో పనిచేసి వీటి మీద అవగాహన తెచ్చుకున్నాడు.

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్లాంట్ ఎన్‌రిచ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయంతో మనీ సర్క్యులేషన్ స్కీం నడపడం కోసం సాఫ్ట్‌వేర్ తయారు చేయించాడు. 2021 అక్టోబర్‌లో విజయవాడలో సంస్థను ప్రారంభించాడు. సంకల్ప్‌ మార్ట్‌ మనీసర్క్యులేషన్ స్కీం పద్ధతిలో సూపర్‌ మార్కెట్‌ ద్వారా సరుకులు విక్రయించడం, ఎర్ర చందనం మొక్కలు, బంగారం, భూమి, ఫ్లాట్లు అంటూ రకరకాల పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేశారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్ పేరుతో ఆర్వోసి నుంచి అనుమతులు తీసుకుని మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు నిర్వహించాడు.

గొలుసుకట్టు తరహాలో సభ్యులు ఒకరు మరొకర్ని చేర్పిస్తే లాభాలు వచ్చి పడతాయని ప్రచారం చేశాడు.రూ.6వేలు చెల్లించి మరికొందరు సభ్యుల్ని చేర్పిస్తే వివిధ దశల్లో కోటిన్నర వరకు వస్తుందని నమ్మబలికాడు. ఎక్కువ మందిని చేర్పించిన వారికి కమిషన్‌తో పాటు బహుమతులు ఇస్థానని ప్రచారం చేశాడు. సూపర్‌ మార్కెట్‌ స్కీం, బంగారం స్కీం, ఓపెన్‌ ఫ్లాట్ స్కీం, ఎర్ర చందనం స్కీం, ఫిక్సిడ్ డిపాజిట్ స్కీంలలో ఎవరైనా డబ్బులు పెట్టుబడిగా పెడితే అతనికి 300శాతం లాభాలను ఆశ చూపారు.

డిపాజిటర్ల ఖాతాల్లో వర్చువల్‌గా నగదు కనిపించేలా ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును రొటేషన్ పద్ధతిలో కొద్ది కొద్దిగా జనాలకు తిరిగి చెల్లించారు. ఈ క్రమంలో వినియోగదారులకు తిరిగి చెల్లించలేని పరిస్థితికి చేరారు. దీంతో వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో డిపాజిట్లు తిరిగి చెల్లించే గడువును పెంచాలని ప్రయత్నించడంతో బెడిసి కొట్టింది.

నిందితుల వద్ద 728 గ్రాముల బంగారం, 10 సెల్‌ఫోన్లు, 9.5కేజీల వెండి, 51 లక్షల నగదు, ఫిక్సిడ్ డిపాజిట్ పేపర్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో గతంలో ఈ తరహా మోసాలు గతంలో చాలా వెలుగు చూసినా మోసపోయే ప్రజలు ఉండటంతో మళ్లీమళ్లీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. క్వాంటమ్, పెరల్స్‌, ఫ్యూచర్ మేకర్‌లైఫ్‌ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, క్వెస్ట్ మార్కెటింగ్ స్కీం వంటి సంస్థలు జనాల్ని నిలువునా ముంచినా మళ్లీమళ్లీ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూస్తూనేఉన్నాయి.

దర్యాప్తు తీరుపై అనుమానాలు....

సంకల్ప సిద్ధి వ్యవహారం విజయవాడలో గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ మోసాలు వెలుగు చూడకుండా కోట్లాది రుపాయలు మీడియా సంస్థలకు, పోలీసులకు పంచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా నిందితులు పోలీసులు అందచేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది.

వారి అండదండలతోనే వందల కోట్ల రుపాయలు జనాలకు కుచ్చుటోపీ పెట్టారని చెబుతున్నారు. సూత్రధారుల్ని వదిలేసి కేవలం తెరపై కనిపించిన వారిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి కేసును ముగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలున్నాయి. గత రెండు నెలలుగా ఈ వ్యవహారం బయట పడకుండా కోట్లాది రుపాయలు లంచాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner