Chandrababu Prashant Kishor Meet : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం, చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ
Chandrababu Prashant Kishor Meet : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం లోకేశ్ తో కలిసి విజయవాడ వచ్చిన ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
Chandrababu Prashant Kishor Meet : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్... టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వీరిద్దరూ ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం ప్రశాంత్ కిషోర్, చంద్రబాబుతో భేటీ అయ్యారు.
గతంలో వైసీపీకి
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. చివరిగా ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత కొంత కాలం బీఆర్ఎస్ కు పనిచేసినట్లు వార్తలు వచ్చినా... ఆ కాంబినేషన్ కుదరలేదు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం... చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఐప్యాక్ లో పనిచేసి రిషి రాజ్ ప్రస్తుతం వైసీపీకి పనిచేస్తున్నారు.
టీడీపీ పనిచేస్తారా?
ఇటీవల పలు టీవీ డిబెట్లలో ప్రశాంత్ కిషోర్ ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ టీవీ డిబెట్ లో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాలో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపడేశారు. ప్రస్తుతం పీకే, సీబీఎన్ భేటీతో ఈ వార్తలు నిజమేనన్న ప్రచారం మొదలైంది. టీడీపీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే పీకే, చంద్రబాబు భేటీ వైసీపీ నేతలను షాక్ గురిచేసే విషయం అంటున్నారు విశ్లేషకులు. టీడీపీకి ప్రస్తుతం రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలను ఆయనే ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా గతంలో ఐ ప్యాక్ లో పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తారా? లేక సలహాలు ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.