Michaung Cyclone Effect : తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన మిచౌంగ్ తుపాను, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Michaung Cyclone Effect : మిచౌంగ్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. దీంతో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
Michaung Cyclone Effect : ఏపీలో మిచౌంగ్ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. గత మూడు రోజులుగా భారీ వర్షాలతో ఏపీ వణికిపోయింది. తుపాను వర్షాలు రైతన్నను నిండా ముంచాయి. భారీ వర్షాలకు వేల ఎకరాల్లో వరి, అరటి, పొగాకు, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిన్న బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కోనసీమలో భారీగా పంటనష్టం
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. తుపాను తీరం దాటి సమయంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కోనసీమ జిల్లాలో ప్రాథమికంగా పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. తుపాను ప్రభావంతో అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకులు పొంగిపొర్లుతున్నాయి. కొండ వాగులు పొంగడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడలో తుపాను బీభత్సం సృష్టించింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగుల గరిష్ఠానికి చేరుకోగా, పది గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సీఎం జగన్ సమీక్ష
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు మరియు అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడి ఆయన… ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని.. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయని గుర్తు చేశారు. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్నారు. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలన్నారు. రూ.10లు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలన్నారు. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్భంలో కానీ వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి అందించాలన్నారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలన్నారు.