Cyclone Rains : కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్, తీవ్ర తుపానుగా బలపడిన మిచౌంగ్-vijayawada news in telugu michaung cyclone effect red alert to coastal ap districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyclone Rains : కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్, తీవ్ర తుపానుగా బలపడిన మిచౌంగ్

Cyclone Rains : కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్, తీవ్ర తుపానుగా బలపడిన మిచౌంగ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 04, 2023 02:37 PM IST

Cyclone Rains : వాతావరణ శాఖ కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మిచౌంగ్ తుపాను
మిచౌంగ్ తుపాను

Cyclone Rains : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతున్నట్లు పేర్కొంది. గంటకు 8 కి.మీ వేగంతో తుపాను కదులుందని, ప్రస్తుతానికి చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 170 కి.మీ, బాపట్లకు 300 కి.మీ, మచిలీపట్నానికి 320కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుపానుగా మిచౌంగ్ తీరం దాటనుందన్నారు. తుపాను ప్రభావంతో నేడు,రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు.

రెడ్ అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. దీంతో ఇప్పటికే తీరప్రాంత జిల్లాల్లో రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కోస్తాంధ్ర తీరప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంలో పలు విమాన సర్వీసులు సైతం రద్దు చేశారు. పలు రైళ్లు కూడా రద్దైయ్యాయి. కాకినాడు జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేశారు. ప్రభుత్వ పాఠశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రైళ్లు రద్దు

తుపాను ప్రభావం దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు చేశారు. తాత్కాలికంగా రైళ్లను దారి మళ్లించారు. రైలు ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడ్రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను డిసెంబర్ 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Whats_app_banner