VMC Anarchy: వరదల్లో మునిగిపోయిన పారిశుధ్య కార్మికుల వేతనంలో కోత వేసిన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్
VMC Anarchy: విజయవాడ వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన పారిశుధ్య కార్మికులపై మునిసిపల్ కార్పొరేషన్ కనికరం లేకుండా ప్రవర్తించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు విధులకు రాలేదంటూ వేతనల్లో కోత విధించింది. రెండు వారాల పాటు వరద ముంపులో ఉన్న కాలానికి వేతనం మినహాయించి జమ చేశారు.
VMC Anarchy: బుడమేరు వరదలో మునిగి నష్టపోయిన పారిశుధ్య కార్మికుల వేతనాలను కార్పొరేషన్ కోత విధించింది. విజయవాడ నగరంలోని 32 మునిసిపల్ డివిజన్లు వరద ముంపుకు గురయ్యాయి. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు 10రోజులు పైగా ముంపులోనే ఉండిపోవాల్సి వచ్చింది. చాలామంది కట్టుబట్టలతో మిగిలారు.వరద ముంపుతో నిరాశ్రయులుగా మారిన వారిలో మున్సిపల్ కార్మికులు కూడా ఉన్నారు. అప్పట్లోనే విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇళ్ళు మునిగి విధులకు రాలేనందున వేతనాల్లో కోత పెట్టడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. స్వచ్ఛ సైనికులుగా పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి అభివర్ణించిన మరుసటి రోజే కార్మికుల జీతాలకు చిల్లుపెట్టడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇళ్ళు మునిగినా, వరదల్లో కూడా కొందరు విధులు నిర్వహించినా అధికారులుు అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో నివసించే కార్మికులకు 15 రోజులు పాటు వేతనంతో కూడిన సెలవులతో పాటు వరద సహాయం అందించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది మున్సిపల్ పారిశుద్ధ్య, ఇతర విభాగాల కార్మికులు బుడమేరు, కృష్ణానది వరదలతో నిండా మునిగిపోయారు. రోజుల తరబడి ఇళ్లలోంచి బయటికి రాగలిగిన పరిస్థితి లేక, సర్వస్వం కోల్పోయారు. అనేకమంది జ్వరాలు, జబ్బుల పాలయ్యారు.
అటువంటి సందర్భంలో మున్సిపల్ అధికారులు... కార్మికులు విధులకు రాలేదనే పేరుతో వారిని సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఉద్యోగం పోతుందనే భయంతో వరదలో సైతం తమ కుటుంబ సభ్యులను వదిలేసి కార్మికులు విధులలో చేరారు. అప్పటినుండి ప్రతిరోజు 12 - గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి నిన్న మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులను స్వచ్ఛ సైనికులుగా అభివర్ణించారు. నాకంటే మున్సిపల్ కార్మికులు బాగా పనిచేశారని, అంటు వ్యాధులు ప్రబలకుండా చూశారని కితాబులు ఇచ్చారు.
ముఖ్యమంత్రి పారిశుధ్యకార్మికుల్ని పొగిడి ఒక రోజు గడవక ముందే మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ శాఖ, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెల వేతనాల్లో భారీ కోత విధించింది. ESI, PF మినహాయించి రూ. 18,000 వేతనం రావలసిన పారిశుద్ధ్య కార్మికులకు 10 నుండి 12 వేల రూపాయలు కోతపెట్టి, ఐదారు వేల రూపాయల మాత్రమే జమ చేశారు.
నగరంలో దాదాపు 15 రోజులపాటు వరదలు ఉన్నందున సెలవుతో కూడిన జీతంతో కూడిన సెలవుగా ఆ దినాలు ప్రకటించాలని సిఐటియు.. మంత్రి నారాయణ, ఇతర మునిసిపల్ అధికారులను కోరితే, కార్మికులకు పూర్తి వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీకి భిన్నంగా కార్మికుల వేతనాల్లో కోత విధించి చెల్లించారు.
వరదల్లో మునిగి సర్వస్వం కోల్పోయిన బాధితులకు, ఇళ్ళు గడవడమే కష్టంగా మారింది. కొంతమందికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందలేదు. గత 25 రోజులుగా రాత్రింబగళ్లు పనిచేస్తున్నారు. నగరమంతటా వ్యర్ధపదార్థాలను తొలగించారు. మంచినీరు, డ్రైనేజీ, వీధిలైట్లు రిపేర్లు చేపట్టారు. కనీస విశ్రాంతి లేకుండా కూడా పనిచేశారు. ఆదివారం సెలవులు కూడా తీసుకోకుండా పనిచేసినా అధికారులు కార్మికుల శ్రమను గుర్తించకుండా నిర్ధాక్షిణ్యంగా వారి వేతనాల్లో కోతపెట్టడంపై నిరసన వ్యక్తం అవుతోంది.
వరద ముంపు నేపథ్యంలో అనేకమంది ప్రైవేట్ యజమానులు సైతం కార్మికులకు జీతంతో కూడిన సెలవులు ఇచ్చారు. అదనపు సహాయం కూడా అందించారు. ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన కార్పొరేషన్ కార్మికుల పొట్ట గొట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి జోక్యం చేసుకుని. కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.