Ambati Rambabu :ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటాం, కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తాం- మంత్రి అంబటి
Ambati Rambabu On Krishna Waters : ఏపీకి న్యాయపరంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతలు బ్రిజేష్ కుమారు ట్రిబ్యునల్ కు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Ambati Rambabu On Krishna Waters : కృష్ణా జలాల పంపకాల్లో ఏపీకి నష్టం జరిగే విధానాన్ని అంగీకరించమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన...కృష్ణా జలాల పంపకాలపై మాట్లాడారు. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీని నిలిపివేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని గుర్తుచేశారు. కృష్ణా జలాల పంపిణీపై కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోమన్నారు. ఏపీకి న్యాయపరంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటామన్నారు. అన్యాయంగా నీటిని తీసుకెళ్తామంటే సహించమన్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్తగా విధి విధానాలు ఇస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణ మధ్య చిన్న సమస్యలు పరిష్కరించడానికే తప్ప.. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని దానికి అప్పగించడం సరికాదన్నారు. 1976లో బచావత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిలాల పంపిణీ జరగాలని ఏపీ ప్రభుత్వం కోరుతుందన్నారు. బచావత్ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించిందన్నారు. ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకు కేటాయించేందుకు కేంద్రం సమక్షంలో ఒప్పందం కుదిరిందన్నారు. బచావత్ కమిషన్ ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయన్నారు. తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్తగా విధివిధానాలు అప్పగించడమేంటని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు
కృష్ణా నదిపై ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బోర్డు ఛైర్మన్ శివ్ నందన్ కుమార్, ఏపీ, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ కు 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు కేటాయించగా, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుత జలాల్లో సాగునీటి కోసం ఇరు రాష్ట్రాల వాటాలు 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కోరగా, తెలంగాణ అందుకు అంగీకరించలేదు.