CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, 13 ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం- 8 వేల మందికి ఉపాధి
CM Jagan : విశాఖ గ్లోబర్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పలు కంపెనీలు ప్రాజెక్టులు ఏర్పాటు చేశాయి. ఈ పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
CM Jagan : విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్... 13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటిలో మూడు కంపెనీలు ప్రారంభం కాగా, 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులతో మొత్తంగా రూ.3008 కోట్ల పెట్టుబడులు, 7455 మందికి ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫుడ్ ప్రాససింగ్ పరిశ్రమల ద్వారా సుమారు 91 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని సీఎం జగన్ తెలిపారు.
13 ప్రాజెక్టులకు శ్రీకారం
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముందుగా 7 ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.2294 కోట్ల పెట్టుబడులు, 4300 మందికి ఉపాధి దొరకుతోందని అధికారులు తెలిపారు. అలాగే ఫుడ్ ప్రాససింగ్ రంగంలో మరో ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు సీఎం జగన్. వీటితో రూ. 714 కోట్ల పెట్టుబడి, 3,155 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
1. తిరుపతి సమీపంలోని నాయుడుపేట వద్ద గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్‌ను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పరిశ్రమతో రూ.800 కోట్ల పెట్టుబడి, 1050 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
2.అనంతపురం జిల్లా డి. హేరేహాల్ వద్ద రూ.544 కోట్లతో ఎకోస్టీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన, దీంతో 500 మందికి ఉద్యోగాలు
3. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శంకుస్థాపన, దీంతో రూ.125 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉద్యోగాలు
4. సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడి, 600 మందికి ఉద్యోగాలు
5. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రావలి స్పిన్సర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శంకుస్థాపన, రూ.150 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
6. బాపట్ల జిల్లా కొరసపాడు వద్ద శ్రావణి బయోఫ్లూయెల్స్ లిమిటెడ్‌కు శంకుస్థాపన, రూ.225 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
7.శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శంకుస్థాపన, రూ.200 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాససింగ్ పరిశ్రమలు :
8. తిరుపతి జిల్లా కంచరపాలెం గ్రామం వద్ద డీపీ చాక్లెట్స్ కంపెనీని సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో రూ.168 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమలో కోకా మాస్, కోకా బటర్, కోకా పౌడర్ ఉత్పత్తి చేయనున్నారు. ఏడాదికి 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 18 వేలమంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
9. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద ఓరిల్ ఫుడ్స్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఇన్‌స్టాంట్ చట్నీలు, పౌడర్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాదికి 7500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, వేయిమంది రైతులకు ఉపయోగం కలగనుంది.
10. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి వద్ద నేటివ్ అరకు కాఫీ కంపెనీకి సీఎం శంకుస్థాపన, రూ.20 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వేయిమంది రైతులకు ప్రయోజనం.
11.కడపజిల్లా పులివెందులలో అరటి ప్రాససింగ్ కోసం రూ.4 కోట్లతో స్ఫూర్తి క్లస్టర్‌కు సీఎం ప్రారంభోత్సవం, బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్స్ తయారు చేయనున్నారు. 700 మంది రైతులకు మేలు కలగనుంది. 20 మందికి ఉద్యోగాలు వస్తాయి.
12. రూ. 65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు, ఆదోని, నంద్యాల, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. 260 మందికి ఉద్యోగాలు, ఏడాదికి 1800 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 20 వేలమంది రైతులకు ప్రయోజనకరం.
13. 3F పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.250 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం వద్ద ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ఉపయోగకరం, 1500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. 50 వేలమంది రైతులకు ప్రయోజనకరం.
ఒక్క ఫోన్ కాల్ దూరంలో
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ... దాదాపుగా 13 యూనిట్లకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నామన్నారు. ఒక యూనిట్ కోసం ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో 386 ఎంఓయూలు, దాదాపు రూ. 13 లక్షల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్నామని గుర్తుచేశారు. ప్రతినెలా ఈ ఎంఓయూల కార్యరూపంలోకి రావాలని సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
పారిశ్రామికవేత్తలతో చర్చిస్తూ...ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు, వారి అవసరాలను తీర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమలతో దాదాపుగా 8 వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయన్నారు. 14 జిల్లాల్లో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు.6 నుంచి 18 నెలల్లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తాయన్నారు. పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని సీఎం జగన్ అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మేం ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నామని మరోసారి గుర్తుచేశారు.