AP SSC Exams 2024 : ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి- విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
AP SSC Exams 2024 : రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3473 పరీక్షా కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
AP SSC Exams 2024 : ఏపీ ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల(AP SSC Exams) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం పదో తరగతి పరీక్షల(AP 10th Exams) నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అంటే 3 గంటల 15 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. విద్యార్థులను 08:45 AM నుంచి 09:30 AM వరకు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు మార్చి 4 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు స్వయంగా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి నుంచి పొందవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులందరూ తమ పరీక్షా కేంద్రాన్ని ముందుగానే చూసుకొని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
అభ్యర్థుల సంఖ్య:
- రెగ్యులర్ అభ్యర్థులు- 6,23,092
- మొత్తం బాలుర సంఖ్య- 3,17,939
- మొత్తం బాలికల సంఖ్య- 3,05,153
- OSSC అభ్యర్థులు- 1,562
- తిరిగి నమోదు చేసుకున్న అభ్యర్థులు- 1,02,528
రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలు(Exam Centers) ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రా లలో అభ్యర్థులకు సౌకర్యంగా బెంచీలు, సరిపడా వెలుతురు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు(3473), డిపార్ట్‌మెంటల్ అధికారులు (3473), ఇన్విజిలేటర్లు(32,000) , ఇతర సహాయక సిబ్బందిని నియమించామన్నారు. పరీక్షా (AP SSC Exams)కేంద్రాల వద్ద అవకతవకలను తనిఖీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో నిఘా కోసం CCTV కెమెరాలు అమర్చినట్లు అధికారులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్, 12/24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌లు, గ్రాఫ్ షీట్‌లు, ఇతర ఎగ్జామినేషన్ మెటీరియల్‌లు ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాలకు పంపించామన్నారు.
పేపర్ లీకేజీ అరికట్టేందుకు కాన్ఫిడెన్షియల్ కోడెట్ పేపర్లు
మాల్‌ప్రాక్టీస్, పేపర్ లీకేజీల(Paper Leakage)ను నిరోధించడానికి అన్ని పరీక్షలకు అభ్యర్థులకు ప్రత్యేకమైన కాన్ఫిడెన్షియల్ కోడెడ్ ప్రశ్న పత్రాలు అందించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక వేళ పేపర్ లీకేజీకి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ పేపర్ ఏ పరీక్షా కేంద్రం నుంచి, ఏ అభ్యర్థి నుంచి వచ్చిందో తెలుసుకొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దీని ద్వారా అవకతవకలకు పాల్పడిన వారిని సులభంగా గుర్తిస్తామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు "నో ఫోన్ జోన్లు"(No Phone Zone)గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇతర నాన్ టీచింగ్, ఇతర డిపార్ట్‌మెంటల్ సిబ్బంది అంటే ఏఎన్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్‌లతో సహా పోలీసు సిబ్బంది పరీక్షా(AP SSC Exams) కేంద్రాలకు మొబైల్ ఫోన్‌లను తీసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఒక వేళ ఎవరైనా ఫోన్ లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రం ప్రధాన గేట్ వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ లో ఇవ్వాలన్నారు. ఈ సూచనను పాటించకుండా ఫోన్ లు పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లిన వారు శిక్షార్హులు అన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలు, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు మొదలైన ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రం ఆవరణలోకి అనుమతించమని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144ను అమలు చేయాలని కోరారు. పరీక్షా కేంద్రాల దగ్గర శాంతిభద్రతలను పరిశీలించడానికి “మొబైల్ పోలీసు స్క్వాడ్‌లు” జిల్లా పోలీసులతో మోహరిస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్/ఫోటోకాపీ కేంద్రాలు, సైబర్ కేఫ్‌లు పరీక్షలు((AP SSC Exams)) జరిగే అన్ని రోజులలో మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. పరీక్షలు ముగిసే వరకు పరీక్షా కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో(APSRTC) విద్యార్థులకు ఉచిత ప్రజా రవాణా ఉంటుందన్నారు. ప్రయాణ సమయంలో హాల్ టిక్కెట్‌ను(AP SSC Hall Tickets) చూపించి పరీక్షాకేంద్రం వరకూ ఉచితంగా ప్రయాణిం చవచ్చన్నారు.
మార్చి 31 నుంచి స్పాట్ వాల్యుయేషన్
జవాబు పత్రాల మూల్యాంకనం కోసం స్పాట్ వాల్యుయేషన్(Spot Valution Camps) క్యాంప్‌లు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు మొత్తం 26 జిల్లాల ప్రధాన కార్యాలయాలలోని నిర్దేశిత వేదికలలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు, దుష్ప్రవర్తన లేదా విచారణల గురించి కంట్రోల్ రూమ్‌ను “0866-2974540” నంబర్‌లో లేదా “dir_govexams@yahoo.com”లో సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
సంబంధిత కథనం