Vande Bharat Express : ఏపీలో మరో వందే భారత్ రైలు, విశాఖ-తిరుపతి మధ్య నడిపే ఛాన్స్!
Vande Bharat Express : ఏపీలో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తుంది. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నాయని తెలుస్తోంది.
Vande Bharat Express : ఏపీలో మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని వార్తలొస్తు్న్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. నిన్న సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీల వందే భారత్ రైలు విశాఖకు బయలుదేరింది. ఈ రైలు విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతారో పూర్తి సమాచారం రాలేదు. కానీ తిరుపతి నుంచి విశాఖకు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాల్తేరు రైల్వే అధికారులు స్పందిస్తూ.. వందేభారత్ రైలుపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.
తరచూ సాంకేతిక సమస్యలు
విశాఖ-సికింద్రాబాద్ మధ్య ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుపుతున్నారు. ఈ రైలులో తరచూ సాంకేతిక సమస్యలను తలెత్తుతున్నాయి. రద్దైన సందర్భాలు కూడా ఉన్నాయి. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరో రైలును చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. కానీ ఎక్కువ శాతం మంది విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడుపుతారనే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నారు.
హైదరాబాద్- బెంగళూరు మధ్య వందే భారత్ రైలు
హైదరాబాద్-బెంగళూరు మధ్య మూడో వందేభారత్ రైలు పరుగులు తిరగనుంది. విశాఖ-తిరుపతి మధ్య మరో వందే భారత్ రైలు వస్తే ఈ సంఖ్య నాలుగుకు చేరనుంది. ఇప్పటికే హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ రైలు మార్గానికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు అయింది. ట్రైల్ రన్ కూడా పూర్తైంది. ఆగస్టు 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెల 25న ఈ రైలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 25 నుంచి అందుబాటులోకి
కాచిగూడ-బెంగళూరులను కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 25 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలుతో హైదరాబాద్-బెంగళూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపడనుంది. ఈ రైలు కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ మధ్య నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ, యశ్వంత్‌పూర్ మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలు కర్నూలు మీదుగా ప్రయాణిస్తుంది. ముందుగా రాయచూర్ మార్గంలో నడపాలని అధికారులు భావించినా ప్రస్తుతం దానిని కర్నూలు మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.