AP RTI Applications: ఏపీలో అతీగతీ లేని ఆర్టీఐ దరఖాస్తులు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్రకటిత ఆంక్షలు-undisclosed rti applications in ap restrictions in all government departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rti Applications: ఏపీలో అతీగతీ లేని ఆర్టీఐ దరఖాస్తులు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్రకటిత ఆంక్షలు

AP RTI Applications: ఏపీలో అతీగతీ లేని ఆర్టీఐ దరఖాస్తులు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్రకటిత ఆంక్షలు

Sarath chandra.B HT Telugu
Mar 21, 2024 07:25 AM IST

AP RTI Applications: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార గోప్యత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వకూడదనే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఏపీలో ఆర్టీఐ చట్టానికి తూట్లు, బుట్ట దాఖలవుతున్న దరఖాస్తులు
ఏపీలో ఆర్టీఐ చట్టానికి తూట్లు, బుట్ట దాఖలవుతున్న దరఖాస్తులు (HT_PRINT)

AP RTI Applications: ఆంధ్రప్రదేశ్‌Ap  ప్రభుత్వ శాఖల్లో గత కొన్నేళ్లుగా సమాచార గోప్యతను పక్కాగా అమలు చేస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వకూడదనే ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలతో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులను Applications పక్కన పడేస్తున్నారు. గడువు తీరిన దరఖాస్తులకు ఏదొక సాకును చూపి పక్కన పెడుతున్నట్లు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

ఏపీలో వైసీపీ YCP  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని ఎలాంటి షరతులు లేకుండా అందించేవారు. కోవిడ్ ఆంక్షలతో Restrictions పాటు ఆర్టీఐ దరఖాస్తుల్లో గోప్యత కూడా మొదలైంది.

ప్రభుత్వ పథకాలు అమలు,ఆర్ధిక అంశాలు,నిధుల కేటాయింపులు, రెవిన్యూ వసూళ్లు వంటి వివరాల కోసం ఆర్టీఐ దరఖాస్తులు అందుతుండటంతో అన్ని శాఖలకు సమాచారం ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు అందాయి. 2021 నుంచి ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం కూడా నిలిపేశారు. కొద్ది నెలల క్రితం హైకోర్టు ఆదేశాలతో తిరిగి కొన్ని GOలను అప్టేడ్ చేస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అది అమలు కావడం లేదు.

లేదు, తెలియదు, చెప్పలేం…

సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన అప్లికేషన్లను 30రోజుల్లోగా జవాబు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వ శాఖలు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. అయా శాఖల బాధ్యులు ఆర్టీఐ దరఖాస్తుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఫైనాన్స్‌, పంచాయితీ, ఎక్సైజ్, ఐఆండ్‌ పిఆర్ వంటి శాఖలు ఏ సమాచారాన్ని అందించకుండా గోప్యత పాటించాయి.

సర్వీస్ మేటర్లకు సంబంధించి ఉద్యోగులు చేసుకునే దరఖాస్తులకు మాత్రమే కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు లభించాయి. ఆర్దిక సంబంధిత వ్యవహారాలు, బిల్లుల చెల్లింపులు, ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులు, పత్రికలు, టీవీలకు సంబంధించిన ప్రకటనల కేటాయింపు, పనుల కేటాయింపు, బడ్జెట్ విడుదల వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి సమాచాారాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్‌, అప్పిలేట్ అథారిటీల ఫోన్‌ నంబర్లతో కూడిన బోర్డులు ఉన్నా అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని తాము ఏమి చేయలేమని నోడల్ అధికారులు చేతులు ఎత్తేశారు. ఆర్టీఐ దరఖాస్తులను క్లియర్ చేసే క్రమంలో ఆయా శాఖలకు ఫైల్‌ పంపినా, ఆర్దిక అంశాలకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వొద్దని కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారులు స్వయంగా ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి.

2014-19 వరకు ఏపీలో ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు ఇచ్చే ప్రక్రియ సజావుగానే సాగింది. 2019 ఎన్నికల సమయంలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం జరిగింది. ఎన్నికల సంఘం అమోదంతో కొందరు ఆ ఆర్టీఐ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతల్లో కమిషనర్లను నియమించింది. ఆర్టీఐ కమిషన్‌ను పునరావాస కేంద్రంగా మార్చేయడంతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే కమిషన్ వ్యవహరించడం ప్రారంభించింది.

రాజకీయ సిఫార్సులతో చేసిన నియామకాలు కావడంతో కమిషన్‌ స్వతంత్రంగా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ శాఖల నుంచి దరఖాస్తుదారులకు కావాల్సిన సమాచారం అందించాల్సిన క్రమంలో, దరఖాస్తుల్లో లోపాలను వెదికి వాటిని తిరస్కరించడానికి ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆర్టీఐ దరఖాస్తులకు కొర్రీలు వేసి కావాల్సిన సమాచారం దరఖాస్తుదారులకు అందకుండా చేశారనే అపప్రద ఏపీ ఆర్టీఐ కమిషన్‌పై ఉంది.

సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారుల వివరాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వంటి వివరాల్లో పూర్తి గోప్యత పాటించారు. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నోడల్ అధికారుల నుంచి కమిషన్‌ వరకు ఒక్కటై వ్యవహరించాయి. టౌన్‌ ప్లానింగ్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్‌, ఐ అండ్‌ పిఆర్‌, ఫైనాన్స్ వంటి శాఖల్లో దరఖాస్తులను గత కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉంచేశారు. సమాచారాం కోసం తిరిగి తిరిగి అధికారుల ఉద్దేశం అర్థమై సమాధానాలు రావని వదిలేసుకున్న వారు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విమర్శల పాలవుతున్న మద్యం ధరలు, టౌన్‌ ప్లానింగ్ ఛార్జీలు, ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో చెల్లించాల్సిన ఫీజుల వంటి విషయాల్లో ఎక్కడా ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండదు. పన్ను చెల్లింపును తగ్గించడం, పెంచడం వంటి విషయాల్లో కిటుకులు ఉద్యోగులకు మాత్రమే తెలియడంతో వారిని ప్రసన్నం చేసుకోవడం తప్ప మరో దారి లేకుండా పోతోంది.

కోడ్ ఝూళిపిస్తారా…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు అవుతోంది. అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు రాజకీయ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రభుత్వ శాఖలపై ఎన్నికల సంఘం వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీఐ దరఖాస్తులకు సహాయ నిరాకరణ చేస్తున్నప్రభుత్వ శాఖలను ఎలక్షన్ కమిషన్ ఎలా దారికి తెస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం