RTI Applications : లేదు, తెలియదు, చెప్పొద్దు… ఆర్టీఐ దరఖాస్తులపై విచిత్ర వైఖరి
RTI Applications ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో విచిత్ర వైఖరి కనిపిస్తోంది. రహస్యాలు,దాపరికాలు లేని పాలనా వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన చట్టాలకు ప్రభుత్వ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. తప్పులు బయట పడతాయనే భయమో, మరేదైనా కారణమో తెలీదు కాని సమాచార హక్కు దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వొద్దని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారే ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తూ సంకెళ్లు వేస్తున్నారు.
RTI Applications ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మెజార్టీ శాఖల్లో ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారాన్ని పొందడం అంత సులువు కాదు. సమాచారం ఇవ్వొద్దని అయా శాఖల అధికారులే కిందిస్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఈ పరిస్థితి లేదు. మొదటి ఏడాది ఆర్టీఐ దరఖాస్తులకు సజావుగానే సమాచారం అందేది. ఆ తర్వాతి కాలంలో పత్రికల్లో కథనాలు రావడం, లోపాలు బయట పడుతుండటంతో మెజార్టీ ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇచ్చేందుకు సమాచార అధికారి ఉంటారు. ఈ ఏర్పాటు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటుంది. దరఖాస్తు చేసిన 30రోజుల్లోగా కోరిన సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు అందించాల్సి ఉంటుంది. 30రోజుల్లోగా సమాధానం లభించకపోతే దరఖాస్తుడు నోడల్ అధికారి పైన అప్పీల్ చేసుకోవచ్చు. 2020 జనవరి నుంచి ఏపీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. కోవిడ్ సమయంలో ఆర్టీఐ దరఖాస్తులపై ఆంక్షలు పెరిగిపోయాయి.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సమాచారం బయటకు వస్తుందనే సాకుతో ఆర్టీఐ దరఖాస్తుల్ని బుట్టదాకలు చేయడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖలో దాదాపు రెండేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వడం లేదు. సంబంధిత శాఖకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు ఉన్నాయని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని తాము స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని ఆర్టీఐ దరఖాస్తులకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్న సిబ్బంది చెబుతున్నారు
తిరస్కరించడానికి కారణాలేమిటి….?
ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించడానికి నిర్దిష్ట కారణాలు ఏమి లేకపోయినా అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నాం కాబట్టి ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదనేది కొందరు అధికారుల వాదనగా ఉంది. ప్రభుత్వ ప్రకటనలు, బకాయిలు, చెల్లింపులు, ఏజెన్సీల ఖరారు, పత్రికలు, టీవీలు, ఔట్ డోర్ పబ్లిసిటీ వంటి ఖర్చులు, చెల్లింపుల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు.
ఐ అండ్ పిఆర్ వంటి ప్రభుత్వ శాఖలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారి దరఖాస్తుల్ని పట్టించుకోవాల్సిన పని లేదని స్వయంగా మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కింది స్థాయి సిబ్బంది కూడా వాటిని పక్కన పడేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీఐ దరఖాస్తుల్ని పరిష్కరించాల్సిన అప్పిలేట్ అధికారులు సైతం తమ నిస్సహాయత స్థితిలో ఉండిపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయంతో నలిగిపోతున్నారు.
అన్ని శాఖల్లో అదే పరిస్థితి….
ఏపీలో విమర్శలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన శాఖ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్. పాలనాపరమైన అనుమతులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు సంబంధించి కీలకమైన దరఖాస్తులు ఏళ్ల తరబడి ఫైళ్లలోనే నలిగిపోతున్నాయి. ఏపీలో పట్టణ ప్రణాళికకు సంబంధించి ఏ పనికి ప్రజలు ఎంత మొత్తంలో చెల్లించాలనే నిబంధనలు ఏ మునిసిపాలిటీ, కార్పోరేషన్‌లో కనిపించవు. టౌన్ ప్లానింగ్ అనుమతులకు సంబంధించిన విధివిధానాలు, చెల్లింపులపై ఎలాంటి అధికారిక ప్రకటనలు బయటకు రావు. అయా పట్టణాలు, నగరపాల సంస్థల్లో మునిసిపల్ సిబ్బంది చెప్పినంత చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలు చెల్లించాల్సిన యూజర్ ఛార్జీలు, పన్నుల విషయంలో విధివిధానాలపై ఆర్టీఐ దరఖాస్తులు ఎన్నటికీ మోక్షం లభించడం లేదు. మునిసిపాలిటీల నుంచి టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ వరకు అవినీతి జాఢ్యం వేళ్లూనుకుపోవడంతో ఆర్టీఐ దరఖాస్తులు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
కమిషన్ ఉన్నా ఫలితం అంతంతే…..
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ దరఖాస్తులను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో కమిషన్ ఉంది. ప్రధాన కమిషనర్‌తో కలిపి ఎనిమిది మంది కమిషనర్లు ఉన్నారు. కమిషన్ లో పూర్తి స్థాయిలో ఉన్నా దరఖాస్తుల్ని పరిష్కరించే విషయంలో అంతంత మాత్రంగానే వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ఇక కొన్ని శాఖలైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఆన్‌లైన్‌లో సమాచారం ఉందని రిప్లై ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఆర్టీఐ కమిషన్ కూడా రాజకీయ సిఫార్సులతో చేసే నియామకాలే కావడంతో ఒత్తిళ్లకు విరుద్ధంగా వ్యవహరించలేన పరిస్థితి ఉంటోంది.