Skill Scam Case : నిజాలు తేలాలంటే CBI విచారణ జరగాల్సిందే - మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
Skill development Scam Updates: స్కిల్ స్కామ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు తెలియకుండా స్కాం జరిగిందంటే ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
Undavalli Arun Kumar On Skill Scam: స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని.. ఇదే విషయాన్ని జీఎస్టీ డీజీ తేల్చారని గుర్తు చేశారు. చంద్రబాబు పాత్ర లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని... ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే బాబుకు రిమాండ్ విధించారని అన్నారు.
"స్కిల్ స్కాంలో పైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌తో సంబంధం లేదని సీమెన్స్ అంటోంది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని చెబుతోంది. అగ్రిమెంట్ పై సంతకాలు చేసిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయలేదని సీమెన్స్ చెప్పింది. చంద్రబాబు హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. ఎందుకని చంద్రబాబు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. బెయిల్ ఇవ్వలేదని న్యాయమూర్తిపై బాబు లాయర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. స్కిల్ స్కాంలో చంద్రబాబే బెయిల్ అడగలేదు. చంద్రబాబు పాత్ర లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే బాబుకు రిమాండ్ విధించారు. సీబీఐ విచారణ చేస్తేనే ఫైళ్లు ఎలా తగలపడ్డాయో తెలుస్తోంది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. సీబీఐ ఎంక్వెరీ అడిగితే తప్పేంటి..? స్కిల్ స్కాంలో సీఐడీ ఎంక్వైరీ తప్పు అంటున్నప్పుడు.. సీబీఐ విచారణను టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది" అంటూ ఉండవల్లి ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారు విమర్శలు చేశారన్నారు ఉండవల్లి. రాజమండ్రి జైలులో సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. "జైలులో లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయొచ్చు.. ఫోన్ డిస్ట్రబెన్స్ ఉండదు. స్కిల్ స్కాం కేసు ఒక పద్ధతిలో వెళ్తుంది. స్కిల్ స్కాం కేసులో అవినీతి జరిగిందని జీఎస్టీ స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు తనను తాను సీఈవో అనుకుంటున్నాడు. అయినా చంద్రబాబుకు తెలియకుండా స్కాం జరిగిందంటే ఎవరూ నమ్మరు" అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే... సీబీఐకి కేసును బదిలీ చేయాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు... నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటిసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది . ఈ కేసులో వాస్తవాలను దర్యాప్తు చేయాలని పిటిషన్ తరుపు న్యాయవాది వాదించారు. ఈడీ, ఐటీ, సీఐడీ కూడా ఈ కేసు విచారణ చేస్తుంది కాబట్టి వాస్తవాలు సీబీఐకి ఇస్తే బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదిస్తూ... సీబీఐకి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.