Tirumala Darshan Tickets : నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల - ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!-ttd will release the quota of special darshan tickets for the month of november on online today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల - ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!

Tirumala Darshan Tickets : నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల - ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 07:30 AM IST

నేడు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల దర్శన టికెట్లు
తిరుమల దర్శన టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…! నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఇప్పటికే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసేసింది. అయితే ఇవాళ(ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.  

మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆగష్టు 27వ తేదీన తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టికెట్లను మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 

ఈ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు:

మరోవైపు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా హాజరవుతారని టీటీడీ తెలిపింది. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది.

ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరంలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగన్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసే పనిలో పడింది.అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

  • 04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
  • 05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
  • 06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,
  • 07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
  • మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,
  • 08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం
  • 09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,
  • 10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
  • రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,
  • 11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,
  • 12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.