Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... కెమెరాలు, రాగి రేకుల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా దక్కించుకోవచ్చు-ttd tender cum auction of six lots of used and partially damaged cameras auctioned on august 28 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... కెమెరాలు, రాగి రేకుల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా దక్కించుకోవచ్చు

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... కెమెరాలు, రాగి రేకుల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా దక్కించుకోవచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 23, 2024 06:36 PM IST

Tirumala Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28వ తేదీన ఈ – వేలం వేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను కూడా వేలం వేయనుంది.

తిరుమల
తిరుమల

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు ఆగష్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429 నెంబర్ ను సంప్రదించవచ్చు.  లేదా టీటీడీ వెబ్‌సైట్‌( www.tirumala.org) లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 

రాగి రేకుల టెండర్‌ కమ్‌ వేలం:

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను కూడా వేలం వేయనుంది.  ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) 15 లాట్లు ఆగష్టు 30న వేలం వేస్తారు. సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429 ను సంప్రదించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

దళారులను నమ్మి మోసపోకండి - టీటీడీ

తిరుమల శ్రీవారి టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్ట పోవద్దని టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తోంది.

తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్ పోర్ట్ లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.

కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత టిటిడి యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికా వద్దని టీటీడీ తెలుపుతోంది. 

భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.