Tirumala Water Crisis: తిరుమలలో నీటి సంక్షోభం, పొదుపుగా వాడుకోవాలని హెచ్చరికలు..వర్షాభావ పరిస్థితులతో టీటీడీ అలర్ట్-water crisis in tirumala warnings to use sparingly ttd alert with rainy conditions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Water Crisis: తిరుమలలో నీటి సంక్షోభం, పొదుపుగా వాడుకోవాలని హెచ్చరికలు..వర్షాభావ పరిస్థితులతో టీటీడీ అలర్ట్

Tirumala Water Crisis: తిరుమలలో నీటి సంక్షోభం, పొదుపుగా వాడుకోవాలని హెచ్చరికలు..వర్షాభావ పరిస్థితులతో టీటీడీ అలర్ట్

Sarath chandra.B HT Telugu
Aug 22, 2024 07:56 AM IST

Tirumala Water Crisis: తిరుమలలో నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, సీమ జిల్లాల్లో ఉన్న వర్షాభావ పరిస్థితులతో తిరుమల గిరులకు నీటి ఎద్దడి తప్పేలా లేదు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తే మరో మూడు - నాలుగు నెలలు మాత్రమే సరిపోతాయని టీటీడీ అంచనా వేస్తోంది.

తిరుమలలో నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం, భక్తులకు టీటీడీ హెచ్చరికలు
తిరుమలలో నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం, భక్తులకు టీటీడీ హెచ్చరికలు

Tirumala Water Crisis: నిత్యం లక్షలాది భక్తులు, వేలాది మంది ఉద్యోగులతో కిటకిటలాడే తిరుమల గిరులకు నీటి సంక్షోభం ముంచుకు వస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో డేంజర్ బెల్స్‌ మోగుతున్నాయి. ఏటా రుతువనాల సమయంలో కురిసే వర్షపు నీటిని నిల్వ చేసి ఏడాది పొడవున వినియోగిస్తుంటారు. తిరుమలలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

తిరుమలలో భక్తులతో పాటు ఉద్యోగులు, స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉందని ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులకు అవగాహన కల్పిస్తోంది.

తిరుమలలోని స్థానికులు, ఉద్యోగులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని టీటీడీ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది.

రోజుకు 43లక్షల గ్యాలన్ల నీటి వినియోగం…

తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గాలన్ల నీటిని తిరుమల డ్యామ్‌ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరిస్తున్నారు.

తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే జలాశయాల్లో అందుబాటులో ఉన్నాయి.

అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయించింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది.భక్తులు మరియు స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

భక్తుల ఆరోగ్య భద్రత టిటిడి ప్రథమ కర్తవ్యం

తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టిటిడి అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చెప్పారు.

టిటిడి ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి ఆరోగ్య విభాగం, ఆహార భద్రత విభాగాలతో కలిసి తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులకు, యజమానులకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ సత్సంగం హాల్లో బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. హోటళ్లలో అన్ని రకాల తినుబండారాలు ఫుడ్ సేఫ్టీ నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని అన్నారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం హోటళ్ళను నిర్వహించాలన్నారు. హోటళ్ల లోపల పరిశుభ్రత, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వడ్డించడం వంటి విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమబద్ధీకరించడం, తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలని ఆయన హోటళ్ల వారికి చెప్పారు.

తరువాత న్యూ ఢిల్లీకి చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫైడ్ ట్రైనర్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అన్ని రెస్టారెంట్‌లు మరియు తినుబండారాలలో అనుసరించాల్సిన పరిశుభ్రత, పారిశుద్ధ్య పద్ధతులు, ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, వృధా వంటి వాటి గురించి వివరించారు, నిబంధనలను ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు వంటి అనేక అంశాలను తెలియజేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమలలో హోటళ్ల వ్యాపారులందరికీ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Whats_app_banner