TTD Proposal Rejected : వెనక్కి తగ్గిన సర్కార్... తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ నిధుల ఖర్చు ప్రతిపాదన తిరస్కరణ
AP Govt Rejected TTD Proposal:తిరుపతి అభివృద్ధికి 1 శాతం నిధులను వెచ్చించాలని ఇటీవలే టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
TTD Proposal Rejected : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధుల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. టీటీడీ ధర్మకర్తల మండలి చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి 1 శాతం నిధులను టీటీడీ నిధుల నుంచి వెచ్చించాలని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం దేవాదాయ శాఖ స్పెషల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుపతి నగర అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్‌లో ఒకశాతం కేటాయించి ఓ ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ధార్మిక సంస్థలే కాకుండా… పలు రాజకీయపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా పునరాలోచనలో పడిన ప్రభుత్వం…. ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవోకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపత్యంలోనే…. టీటీడీ ప్రతిపాదనలను తిరిస్కరిస్తూ ఆదేశాలను ఇచ్చింది.
ఇక టీటీడీ నిధులను ఖర్చు చేయాలనే వాదనను కూడా పలువురు సమర్థించారు. ఓనాడు పెద్దగా జనాభాలేని తిరుపతి… ఇవాళ మహానగరంగా మారిందని చెప్పుకొచ్చారు. నిత్యం భక్తుల రాకతో తిరుమల తిరుపతి రద్దీగా మారిందని… ఈ క్రమంలో భక్తులు ఇబ్బందిపడకుండా… టీటీడీ నిధులను ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మొత్తంగా చూస్తే… ఓవైపు విమర్శలు, మరోవైపు సమర్థనలు వినిపించిన క్రమంలో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేందుకే మొగ్గు చూపింది.