Tirumala Navaratri Brahmotsavalu: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14న అంకురార్పణ
Tirumala Navaratri Brahmotsavalu: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 14న అంకురార్పణ నిర్వహిస్తారు.
Tirumala Navaratri Brahmotsavalu: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 14న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
అక్టోబరు 14న శనివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు.
అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం.
బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబరు 15న ఉదయం 9 నుండి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.