SVIMS Tirupati : స్విమ్స్ నెఫ్రాలజీలో టెలీ మెడిసిన్ వ్యవస్థ - టీటీడీ ఈవో ఆదేశాలు
TTD Latest News:తిరుపతి స్విమ్స్‌లో నెఫ్రాలజీ(Nephrology) విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు విభాగాలను పరిశీలించిన ఆయన…పలువురి రోగులతో మాట్లాడారు.
SVIMS Tirupati Latest News: కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి నెఫ్రాలజి విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి . ఈ మేకకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి శుక్రవారం ఆయన నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డులు, డయాలసిస్ వార్డులు, ఐ సి యూ విభాగాలను పరిశీలించారు. ఇక్కడ అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఇంటి వద్దే డయాలసిస్ చేసుకునే అవకాశం ఉండి ఆసుపత్రికి వస్తున్న రోగుల గురించి ఈవో వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కోసం ఉపయోగించే బ్యాగులకు డిమాండ్ ఉందని డాక్టర్లు చెప్పారు. ఏపీ ఎంఐడిసి చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తో ఈవో అక్కడి నుండే ఫోన్ లో మాట్లాడి స్విమ్స్ కు డయాలసిస్ బ్యాగులను పంపాలని కోరారు. రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న పిల్లలకు పెన్షన్ రావడం లేదని బాధితుల కుటుంబీకులు ఈవో దృష్టికి తెచ్చారు. పెన్షన్ మంజూరు చేయించడానికి తమవైపు నుంచి సహాయం చేస్తామని ఈవో హామీనిచ్చారు. స్విమ్స్ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత గురించి విద్యార్థులతో మాట్లాడారు.
అనంతరం ఈవో ధర్మారెడ్డి... ఆయా విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ... ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలాజి, యూరాలజి విభాగాల పనితీరు బాగుందని అభినందించారు.
ఆలయ పనులు ప్రారంభం….
నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7వ తేదీ బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఉదయం 6-30 గంటల నుండి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ నిర్వహించారు.
ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ 100 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు.వీలైనంత త్వరగా భక్తులకు నూతన ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రస్తుతం ముంబైలో ఉన్న టీటీడీ ఆలయం భక్తుల రద్దీకి తగినట్టుగా లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది.