Travels Driver Murder: చిత్తూరులో ఘోరం, ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌పై బస్సును నడిపిన మరో డ్రైవర్
Travels Driver Murder: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో దారుణ ఘటన జరిగింది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తో జరిగిన వాగ్వాదంతో ఆవేశానికి గురైన డ్రైవర్ అతడిని బస్సుతో ఢీకొట్టి ఈడ్చుకువెళ్లాడు.
Travels Driver Murder: ఆవేశంలో విచక్షణ మరచిపోయిన ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కిరాతకంగా ప్రవర్తించాడు. మరో ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను బస్సుతో ఢీకొట్టి ఈడ్చుకువెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
బెంగుళూరు నుంచి విజయవాడ వెళుతున్న రెండు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణతో ఈ హత్య జరిగింది. ఒకరితో ఒకరు గొడవ పడటంతో ఆవేశానికి గురైన డ్రైవర్ మరో డ్రైవర్‌ను బస్సు తొక్కించి చంపేశాడు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ల మధ్య జాతీయ రహదారిపై తలెత్తిన వివాదం చివరకు హత్యకు కారణమైంది. ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మానవత్వం, విచక్షణ మరిచిపోయిన ట్రావెల్స్ డ్రైవర్ కిరాతకంగా ప్రవర్తించాడు. బస్సు ఎదుట నిలబడి మాట్లాడుతున్న డ్రైవర్‌ను ఢీకొట్టి చంపేశాడు. వాహనం ఆపకుండా కిలోమీటర్ ఈడ్చుకుంటూ పోయాడు.
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం పరిధిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లేందుకు మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులు సోమవారం రాత్రి 9.30-10 గంటల మధ్యలో బెంగుళూరులో బయలుదేరాయి.
ఈ బస్సులు సోమవారం రాత్రి 1.30-2 గంటలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మహా సముద్రం టోల్ గేట్ వద్ద ఒకదానితో మరొకటి రాసుకుంటూ వెళ్లాయి. ఈ క్రమంలో ఓ బస్సుకు చెందిన రియర్ వ్యూ మిర్రర్ పాడైంది. దీంతో రెండు బస్సుల డ్రైవర్లు టోల్ గేట్ దగ్గర గొడవ పడ్డారు.
అక్కడి నుంచి టోల్ గేట్ సమీపంలో మరోసారి బస్సులు ఆపేసి గొడవ పడ్డారు. బస్సు పాడవడంతో సమాధానం చెప్పాలని డ్రైవర్ మరో డ్రైవర్‌ను నిలదీశాడు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సుధాకర రాజు బస్సు నుంచి కిందకు దిగి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు అడ్డుగా నిలిచాడు. డ్రైవర్‌తో మాట్లాడుతుండగానే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. సుధాకర్ రాజు మీదకు బస్సును పోనిచ్చాడు. ఈ ఘటనలో సుధాకర్ రాజు బస్సు కింద చిక్కుకుపోయాడు.
శ్రీనివాసరావు బస్సును ఆపకుండా కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో సుధాకర్‌రాజు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. మృతదేహం చిద్రమైపోయింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును కొంత దూరంలో అడ్డుకున్నారు.
టోల్ గేటు వద్దనున్న సీసీ టీవీ కెమెరాలలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు సుధాకర రాజును తొక్కుకుంటూ వెళ్లడం రికార్డైంది. సీసీ టీవీ దృశ్యాలను ఫుటేజీని స్వాధీనం చేసుకున్న బంగారుపాళ్యం పోలీసులు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీని వాసరావుపై హత్య కేసు నమోదు చేశారు.
మార్నింగ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సుధాకర రాజు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించార. వారంరోజుల క్రితం మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌లో ఉద్యోగంలో చేరారు. మృతుడి కుటుంబం పొన్నూరులో స్థిరపడింది. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు విజయవాడ అయ్యప్పనగర్ యనమలకుదురు రోడ్డులో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు, చెన్నైల నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుంటాయి. బెంగుళూరులోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణికులను అర్థరాత్రి వరకు ఎక్కించుకుని తెల్లవారే లోపు విజయవాడ చేరేందుకు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో జాతీయ రహదారులపై డ్రైవర్ల మధ్య ఘర్షణలు పరిపాటిగా మారింది. రవాణా శాఖ నియంత్రణ లేకపోవడం, ప్రయాణ సమయంపై నియంత్రణ లేకపోవడంతో ఈ ఘటనలు జరుగుతున్నాయి.