Mother and Son: సామర్లకోటలో విషాదం, కరెంట్ షాక్‌తో 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీ కుమారుడు..
Mother and Son: తల్లి చనిపోయిన 24గంటల్లోనే కుమారుడు కూడా కరెంటు షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఎక్కడ ప్రాణాలు విడిచిందో బంధువులకు చూపిస్తూ అనూహ్యంగా అదే స్థలంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నింపింది.
Mother and Son: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు బంధువులకు తల్లి ఎక్కడ ప్రాణాలు విడిచిందో వివరిస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన సామర్లకోటలో జరిగింది. తల్లీ కుమారులు ఇద్దరూ 24 గంటల వ్యవధిలో ఒకే తరహాలో మరణించడం అందరిని కలిచివేసింది. తన తల్లి ఈ ప్రాంతంలోనే చనిపోయిందని బంధువులకు చెబుతూ ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యాడు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన విషాద ఘటనలో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. విద్యుత్ షాక్‌తో తల్లి మరణించిన 24 గంటల వ్యవధిలోనే కుమారుడు కూడా అదే ప్రాంతాంలో ప్రమాదానికి గురయ్యాడు. కరెంట్ వైరు తెగిపడి ఉంటాన్ని గమనించకపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కనిపించకుండా పడి ఉన్న విద్యుత్ వైరు ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది.
సామర్లకోట పట్టణ పరిధిలో వీర్రాఘవపురంలో చిట్టిమాని పద్మ(40) భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విశ్వేష్‌తో కలిసి నివాసం ఉంటోంది. భర్త అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటున్నారు. పద్మ చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు విశ్వేస్ రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటాడు. రెండు రోజుల క్రితం పద్మ ఇంటి సమీపంలో కరెంట్ స్తంభం నుంచి వచ్చే తీగల్లో ఒకటి తెగిపోయింది. దానిని ఎవరూ గుర్తించలేదు.
శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పద్మ తెగిన విద్యుత్ వైరు సమీపంలో కింద పడి మృతిచెందింది. చుట్టుపక్కల వారంతా ఆమెది సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం పద్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన బంధువులకు విశ్వేస్ తన తల్లి చనిపోయిన ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేస్తుండగా జారిపపడిపోయాడు. ఈ ప్రాంతంలోనే అమ్మ కింద పడిపోయి ఉందని వారికి చెబుతూ పొరపాటున జారి పడిపోతుండగా పక్కనే ఉన్న గోడను ఆసరాగా పట్టుకోబోయాడు.
అప్పటికే అక్కడ కరెంటు స్తంభం నుంచి తెగి పడినవైరు గోడ మీదుగా ఉంది. దాన్ని తాకిన వెంటనే విద్యుదాఘాతానికి గురై విశ్వేస్ మృతిచెందాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకు ముందు పద్మ కూడా విద్యుదాఘాతంతోనే ప్రాణాలు కోల్పోయి ఉంటుందని నిర్థారణకు వచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు.
బాధిత కుటుంబాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం పరామర్శించారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్తు శాఖ అధికారులు స్పేవైరును తొలగించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు.