Manyam Tragedy: పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో విషాదం..ప్రేమించిన వాడితో పెళ్లి కాలేదని అక్క ఆత్మహత్య, మనస్తాపంతో చెల్లి..-tragedy in parvathipuram manyam district young woman committed suicide because she could not marry her lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Manyam Tragedy: పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో విషాదం..ప్రేమించిన వాడితో పెళ్లి కాలేదని అక్క ఆత్మహత్య, మనస్తాపంతో చెల్లి..

Manyam Tragedy: పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో విషాదం..ప్రేమించిన వాడితో పెళ్లి కాలేదని అక్క ఆత్మహత్య, మనస్తాపంతో చెల్లి..

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 09:01 AM IST

Manyam Tragedy: పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో పెళ్లి జ‌రగ‌క పోవడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. అక్కడ చనిపోవడంతో మనస్తాపానికి గురైన చెల్లెలు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మ‌ర‌ణంలోనూ అక్కా చెల్లెళ్లు ఒకరినొకరు వీడక పోవడం అందరిని కలిచి వేసింది.

సాలూరులో ఆత్మహత్య చేసుకున్న అక్కా చెల్లెళ్లు
సాలూరులో ఆత్మహత్య చేసుకున్న అక్కా చెల్లెళ్లు

Manyam Tragedy పార్వ‌తీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో అక్క‌కు పెళ్లి జ‌ర‌గ‌లేదు. దీంతో చెల్లెలి వ‌ద్ద అక్క బోరున విల‌పించింది. మ‌నస్థాపానికి గురైన అక్క‌, చెల్లెళ్లిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచల‌నం రేపింది. మృతుల కుటుంబాల్లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

వాళ్లిద్ద‌రూ వ‌రుస‌కు అక్కాచెల్లెల్లు, అంత‌కు మించి మంచి స్నేహితులు. వారి స్నేహ‌బంధాన్ని చూసి ఎవ‌రికి అసూయ‌పుట్టిందో గానీ విధి వారిని దూరం చేయాల‌ని చూసింది. అందులో ఒక‌రికి అనుకోని క‌ష్టం వచ్చింది. దీంతో త‌న‌కు జీవితంపై ఆశ లేద‌ని, చ‌నిపోతాన‌ని తోటి స్నేహితురాలు, చెల్లిల‌తో చెప్పింది. నీతో నేను వ‌స్తానంటూ స్నేహితురాలి మ‌ర‌ణంలోనూ మ‌రో యువ‌తి తోడైంది. మ‌ర‌ణంలోనూ వీడని ఈ వీరి స్నేహం ఎంత బ‌ల‌మైందో స్ప‌ష్టం అయింది.

ఈ విషాద ఘ‌ట‌న పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా పాచిపెంట మండ‌లంలో చోటు చేసుకుంది. సేబి సోంబార‌మ్మ (24), పోయి ల‌క్ష్మి (19) వ‌రుస‌కు అక్కాచెల్లెళ్లు. చిన్నాన్న పెద‌నాన్న పిల్ల‌లు. సోంబార‌మ్మ త‌న మామ కొడుకుని ప్రేమించింది. దీంతో ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిశ్చ‌యించారు. అయితే ఇంత‌లోనే రెండు కుటుంబాల మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు చోటు చేసుకున్నాయి. వారి పెళ్లి మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

దీంతో సోంబార‌మ్మ తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. త‌న క‌ష్టాన్ని చెల్లితో పంచుకుంది. బోరున విల‌పిస్తూ క‌న్నీరు పెట్టుకుంది. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి మెలిసి పెరిగిన ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు వ‌దిలి ఉండలేక‌పోయారు. దీంతో సోమ‌వారం అర్థ‌రాత్రి స‌మీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం ఇద్ద‌రు పిల్ల‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో రెండు కుటుంబాలు ఆందోళ‌న చెందాయి. వెత‌క‌టం ప్రారంభించారు. బావివైపు వెళ్లిన గ్రామ‌స్థుల‌కు అందులో మృత దేహాలు క‌నిపించాయి. దీంతో ఆయా కుటుంబాల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ స‌భ్యులు అక్క‌డికి వ‌చ్చి, బోరున విల‌పించారు. కుటుంబ స‌భ్యులు, బంధువుల రోద‌న‌లు మిన్నంటాయి.

గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డ అన్ని పరిశీలించి, మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. అక్కాచెల్లెళ్ల కంటే స్నేహితుల్లా ఉండేవార‌ని, వారు త‌మ స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు చెప్ప‌కుండా మృతి చెందార‌ని గ్రామ‌స్థులు ఆవేద‌న చెందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

మృతుల త‌ల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం సాలూరు రీజ‌న‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌టల్‌కి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న గిరిజ‌న శాఖ మంత్రి జి.సంధ్యారాణి కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలిపారు. ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయ చ‌ర్య‌లు అందించాల‌ని సీఐ రామ‌కృష్ణ‌ను మంత్రి సంధ్యారాణి ఆదేశించారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)