Tirupati Rains : నెల్లూరు-చెన్నై రహదారిపై వరద నీరు-ఏపీ, తమిళనాడు మధ్య రాకపోకలు బంద్
Tirupati Rains : తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలో నెల్లూరు-చెన్నై జాతీయ రహదారిపై 4 అడుగుల మేర నీరు చేరింది.
Tirupati Rains : తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజినీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలి లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు.
ఉద్ధృతంగా కాళంగి నది
సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలోని గోకుల కృష్ణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ నెల్లూరు-చెన్నై జాతీయ రహదారిపై 4 అడుగుల మేర నీటిమట్టంతో ప్రవహిస్తుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లుతో మూసివేశారు. దీంతో నెల్లూరు-చెన్నై నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి లేదా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ప్రజలకు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
మిచౌంగ్ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమలలో పర్యాటక ప్రదేశాల సందర్శనను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో పాపవినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగ ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను అనుమతించడంలేదు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా భారీ వృక్షాలు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.