AP Rains Update: ఏపీలో మరో మూడు రోజులు వానలే వానలు, బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఎఫెక్ట్…
AP Rains Update: ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా జిల్లాల్లో ప్రజలు ఎండముఖం చూసి వారం దాటిపోయింది. గత వారం పదిరోజులుగా ముసురు వాతావరణం, అల్పపీడనం ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
AP Rains Update: ఏపీలో వరుసగా రెండో వారం కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. జూలై నెలలో దాదాపు పదిరోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో కరువు తీరా వానలు పడుతున్నాయి. గత పదిరోజులుగా కోస్తాలో పలు జిల్లాలు కనీసం ఎండను చూడలేకపోయాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పలకరిస్తూనే ఉన్నాయి.
ఏపీలో మరో మూడ్రోజుల పాటు వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం స్పిల్ వే వద్ద గురువారం ఉదయం 11లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
మరోవైపు ఉపరి తల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసాయి. రాయలసీమలో కూడా అక్కడక్కడా వర్షాలు పడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఐఎండి విశాఖపట్నం ప్రకటించింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళా ఖాతంలో రుతుపవనాలతో ఏర్పడిన కరెంట్ బలంగా ఉన్నందున తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో కోస్తా జిల్లాల్లో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ మీదుగా కొనసాగుతోంది. బెంగాల్ సముద్ర తీరంలో జూలై 26, 27 తేదీలలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండి బుధవారం ప్రకటించింది.
అల్పపీడనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంలో విలీనమై మరింత బలపడుతుందని వల్ల దాని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని అంచనా వేశారు. 27వ తేదీ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండి హెచ్చరించింది.
ఏపీలో రుతుపవనాలు బలంగా విస్తరించిన నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో రాత్రిపూట వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు 4 రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆగస్టు మొదటి వారంలో ఏపీలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.