Kurnool Tragedy : క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంత‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి-three children died after falling into a water hole in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Tragedy : క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంత‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి

Kurnool Tragedy : క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంత‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి

Basani Shiva Kumar HT Telugu
Oct 06, 2024 09:44 AM IST

Kurnool Tragedy : ద‌స‌రా సెల‌వులొచ్చాయి.. అల్ల‌రి చేస్తూ స్నేహితుల‌తో ఆట‌ల్లో చిన్నారులు నిమ‌గ్న‌మ‌య్యారు. సెల‌వుల్లో స‌ర‌దాగా గ‌డుపుతున్న ముగ్గురు చిన్నారులను మృత్యువు క‌బ‌ళించిది. బ‌హిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. ఆడుకుంటూ నీటి కుంట‌లో మునిగిపోయారు. ఈ ఘ‌ట‌నలు క‌ర్నూలు జిల్లాలో జరిగింది.

క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం
క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం

క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం మండ‌లం మాచాపురం గ్రామంలో శ‌నివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమ‌శేఖ‌ర్‌, జ‌య‌మ్మ‌ దంప‌తుల కుమారుడు బోయ జుట్ల హ‌నుమేష్ (6), బోయ‌భైరి న‌డిపి రంగ‌స్వామి, ఉరుకుంద‌మ్మ దంప‌తుల కుమారుడు ఉద‌య్ కిర‌ణ్ (11), బోయ శ్రీ‌నివాసులు కుమారుడు వంశీ, బోయ పాండు కుమారుడు బోయ చ‌ర‌ణ్ క‌లిసి శ‌నివారం సాయంత్రం బ‌హిర్భూమికి వెళ్లారు.

నీటి కోస‌మ‌ని పొలంలో ఉన్న గుంత‌లోకి దిగారు. ప్ర‌మాద‌వ‌శాత్తు హ‌నుమేష్ గుంత‌లో ప‌డిపోయాడు. హ‌నుమేష్‌ను ర‌క్షించ‌డానికి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ కూడా గుంత‌లో జారిప‌డ్డాడు. వెంట‌నే మిగిలిన ఇద్ద‌రూ వంశీ, చ‌ర‌ణ్ గ్రామానికి వెళ్లి ఈ విష‌యాన్ని గ్రామ‌స్తుల‌కు తెలిపారు. గ్రామ‌స్తులు వ‌చ్చి గుంత‌లోకి దిగి హ‌నుమేష్‌, ఉద‌య్ కిర‌ణ్‌ను గ్రామ‌స్తులు బ‌య‌ట‌కు తీశారు.

అప్ప‌టికే ఇద్ద‌రూ చిన్నారులు మృత్యుఒడికి చేరుకున్నారు. వీరిద్ద‌రూ గ్రామంలో ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్నారు. గ్రామంలో ఇద్ద‌రు చిన్నారులు చ‌నిపోవ‌డంతో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. చిన్నారులు త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు, చిన్నారులస్నేహితుల క‌న్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని పరిశీలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు మండ‌లం ఎస్‌.నాగ‌లాపురానికి చెందిన మాణిక్య‌రావు, శాంత‌కుమారి దంప‌తుల మూడో సంప‌త్ కుమార్ (12) ద‌స‌రా సెల‌వుల్లో అమ్మ‌తో క‌లిసి అమ్మ‌మ్మ గ్రామ‌ం పార్ల‌ప‌ల్లికి వెళ్లాడు. శ‌నివారం స్నేహితుల‌తో క‌లిసి ఆడుకుంటూ గ్రామ స‌మీపంలోని వంక వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ బ‌హిర్భూమికి వెళ్లి త‌రువాత వంక‌లోకి దిగాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు వంక‌లో జారి ప‌డ్డాడు.

లోతు ఎక్కువ‌గా ఉండ‌డంతో బ‌య‌ట‌కు రాలేక ఊపిరాడ‌క మ‌ర‌ణించారు. గ్రామ‌స్తులకు తోటి స్నేహితులు చెబితే.. వంక వ‌ద్ద‌కు వ‌చ్చి సంప‌త్ కుమార్‌ను వెతికి తీశారు. సంప‌త్ కుమార్ అప్ప‌టికే మ‌ర‌ణించాడు. దీంతో ఆ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. త‌ల్లిదండ్రులు రోద‌న‌లు మిన్నంటాయి. కుటుంబ స‌భ్యులు, బంధువుల క‌న్నీరు మున్నీరు అయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి పరిశీలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఇద్ద‌రు..

కాకినాడ రూర‌ల్ మండ‌లం తూరంగి గ్రామంలోని ఉప్ప‌రిపేట‌కు చెందిన న‌లుగురు చిన్నారులు.. కొవ్వూరు గ్రామంలో ఉన్న అయ్య‌ప్ప దేవాల‌యం ఎదురుగా ఉన్న పంట కాలువ‌లో స్నానానికి దిగారు. వారిలో గండికోట దుర్గాప్ర‌సాద్ (10), జ‌క్కి అభిరామ్ (8) గ‌ల్లంత‌య్యారు. మిగిలిన ఇద్ద‌రు చిన్నారులు కేక‌లు వేయ‌డంతో వెంట‌నే స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. చిన్నారులిద్ద‌రు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వారి ఆచూకీ ల‌భ్యం కాలేదు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. గ‌జ ఈత‌గాళ్ల‌తో గాలించి ఇద్ద‌రు చిన్నారుల‌ను వెలికితీశారు. అప్ప‌టికే దుర్గా ప్ర‌సాద్ మ‌ర‌ణించారు. కొన ఊప‌రితో ఉన్న అభిరామ్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మార్గ‌మ‌ధ్య‌లోనే అభిరామ్ కూడా మృతి చెందాడు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం జరిగింది.

పురుగుల మందు తాగి..

క‌ర్నూలు జిల్లాలో ఎమ్మిగ‌నూరు మండ‌లం కె.నాగ‌లాపురానికి చెందిన బి.కాసీం, జ‌య‌ల‌క్ష్మి దంపతుల ఇద్ద‌రు కుమారుడు బి.మ‌హిరాం (5) ఉన్నాడు. మహిరాం, అదే వీధిలో ఉండే స్నేహితుడు హ‌రికృష్ణ ఇద్ద‌రూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో తాగే ద్ర‌వం అనుకుని పంట‌ల‌కు పిచికారీ చేసేందుకు తెచ్చిన‌ క్రిమిసంహార‌క పురుగుమందు తాగారు. కొద్ది సేప‌టికి క‌డుపునొప్పి తాళ‌లేక మ‌హిరాం త‌న త‌ల్లికి చెప్పాడు. ఇద్ద‌రినీ ఎమ్మిగ‌నూరు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే మ‌హిరాం మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. హ‌రికృష్ణ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే మ‌హిరాం తండ్రి కాశీం గ‌తంలోనే చ‌నిపోగా.. త‌ల్లి జ‌య‌ల‌క్ష్మి కూలీ ప‌నులు చేస్తూ ఇంటిని నెట్టుకొస్తుంది. హ‌రికృష్ణ తండ్రి మ‌హేష్ బ‌తుకుదెరువుకు హైద‌రాబాద్‌లో ఉంటున్నాడు. మ‌హిరాం త‌ల్లి జ‌య‌ల‌క్ష్మి రోద‌న‌లు మిన్నంటాయి. భ‌ర్త లేక‌, ఇప్పుడు కొడుకు లేక‌పోవ‌డంతో ఆ త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోతోంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner