Kakinada GGH : కాకినాడ జీజీహెచ్ వైద్యులు అదుర్స్, కామెడీ సీన్లు చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ తొలగింపు
Kakinada GGH : కాకినాడ జీజీహెచ్ వైద్యులు అదుర్స్ అనిపించారు. 55 ఏళ్ల మహిళకు కామెడీ సీన్స్ చూపిస్తూ సర్జరీ చేశారు. బ్రెయిన్ లోని ట్యూమర్ ను శస్త్ర చికిత్స చేసి తొలగించారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Kakinada GGH : కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా కామెడీ సీన్స్ చూపిస్తూ "అవేక్ క్రానియోటమీ" ద్వారా ఒక మహిళా రోగి బ్రెయిన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. చాలా సున్నితమైన ఈ సర్జరీని జీజీహెచ్ లో తొలిసారి చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ విజయవంతం అవ్వడంతో వైద్యులు ప్రశంసలు అందుకుంటున్నారు.
సాధారణంగా ఆపరేషన్ సమయంలో పేషెంట్‌కు మత్తుమందు ఇస్తారు. పేషెంట్ కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ఇలా చేస్తుంటారు. పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా సినిమాలోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు కాకినాడ జీజీహెచ్ వైద్యులు.
పేషెంట్ ట్యాబ్ పట్టుకుని అదుర్స్ సినిమాలోని జూ.ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా వైద్యులు ఆమె తలలోని కణితిని తొలగించారు. కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి(55) అనే మహిళకు కుడి చేయి, కాలు లాగుతున్నాయని అనేక ప్రైవేట్ ఆసుపత్రులకు తిరిగింది. తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, కుడి వైపున తిమ్మిరి కారణాలతో సెప్టెంబర్ 11న కాకినాడలోని జీజీహెచ్ లో చేరింది. ఆమె మెదడుకు ఎడమవైపున 3.3 x 2.7 సెం.మీ కణితిని వైద్యులు గుర్తించారు.
మంగళవారం జీజీహెచ్ సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల ఆధ్వర్యంలో అనంతలక్ష్మికి సర్జరీ ప్రారంభించారు. చాలా కొద్ది మోతాదులో మత్తు ఇచ్చి, ఆమె మెలకువగా ఉండగానే శస్త్ర చికిత్స చేశారు. ఆమె స్పృహలో ఉండేందుకు వైద్యులు జూ.ఎన్టీఆర్, బ్రహ్మానందం నటించిన అదుర్స్‌లోని ఆమెకు ఇష్టమైన కామెడీ సీన్లు ప్లే చేశారు. ఈ సినిమాలో నిమగ్నమైన ఆమెకు నొప్పి తెలియకుండానే సర్జరీ పూర్తి చేశారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రోగి లేచి కూర్చుని అల్పాహారం తీసుకోగలిగారని, ఐదు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
ఈ రకమైన సర్జరీ చేయడం కాకినాడ జీజీహెచ్ లో మొదటిసారి అని డాక్టర్ లావణ్యకుమారి చెప్పారు. సర్జరీ సమయంలో రోగులు మెలకువగా ఉంటే, వైద్యుల ప్రశ్నలకు స్పందిస్తుంటే నరాలు దెబ్బతినకుండా చికిత్స చేయవచ్చని డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ విజయశేఖర్ వివరించారు.
సంబంధిత కథనం