Guntur GGH Incident : గుంటూరు జీజీహెచ్ లో రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం, స్నేహితురాలి కోసం చిక్కుల్లో పడ్డ మహిళ!
Guntur GGH Incident : గుంటూరు జీజీహెచ్ లో రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం కలకలం రేపుతోంది. స్నేహితురాలి బిడ్డ చనిపోవడంతో.. ఆమెను ఓదార్చేందుకు ఓ మహిళ బిడ్డను కొనుగోలు చేసింది. ఆసుపత్రి సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయపడింది.
Guntur GGH Incident : గుంటూరు జీజీహెచ్ లో చిన్నారి విక్రయం కలకలం రేపుతోంది. స్నేహితురాలికి సాయం చేయాలని భావించి శిశువును తీసుకొచ్చిన ఓ మహిళ చిక్కుల్లో పడింది. చినగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి తన బిడ్డను రూ.1.90 లక్షలకు అమ్మేశాడు. ఇటీవల గుంటూరు జీజీహెచ్ కు తన భార్య లక్ష్మిని డెలివరీకి తీసుకెళ్లాడు సుబ్రమణ్యం. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మి ఆసుపత్రిలోనే చనిపోయింది. అప్పటికే లక్ష్మికి 8 మంది పిల్లలున్నారని సమాచారం. నెలలు నిండడంతో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి అనే మహిళ జీజీహెచ్ లో చేరింది. డెలివరీ తర్వాత మీరాభికి పుట్టిన బిడ్డ చనిపోయింది. తక్కువ బరువుతో పుట్టడంతో మీరాభి శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బిడ్డ చనిపోవడంతో మీరాభి తీవ్ర ఆవేదనకు గురైంది. ఆ బాధను చూడలేక మీరాభి స్నేహితురాలు ప్రభావతి, సుబ్రమణ్యంతో చిన్నారి కోసం సంప్రదింపులు జరిపింది. తన బిడ్డను విక్రయించేందుకు సుబ్రమణ్యం ఒప్పుకున్నాడు. ఈ నెల 7న చినగంజాం వెళ్లిన మీరాభి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మీరాభి వద్ద మరో బిడ్డను చూసిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో బిడ్డను రూ.1.90 లక్షలకు కొనుగోలు చేసినట్లు మీరాభి స్నేహితురాలు ప్రభావతి ఒప్పుకుంది. తన స్నేహితురాలిని ఓదార్చేందుకు తాను ఇలా చేశానని ఆమె తెలిపింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును చినగంజాం పీఎస్ కు బదిలీ చేశారు. శిశువును కొనుగోలు చేసినందుకు ప్రభావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శిశు సంరక్షణ శాఖ సిబ్బంది మీరాభి వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు.
వీధి కుక్కల దాడిలో 10 నెలల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కలు 10 నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. అనంతం చిన్నారి మృతదేహాన్ని అత్యంత దారుణంగా పీక్కుతిన్నాయి. ఈ ఘటన బోధన్ లో సోమవారం రాత్రి చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ పట్టణంలో ఓ మహిళ భిక్షాటన చేస్తూ పొట్టుపోసుకుంటుంది. ఆమె తన 10 నెలల కుమారుడ్ని...కొత్త బస్టాండ్ ప్రాంతంలో రాత్రి ఓ చెట్టు కింద ఉంచి పనిమీద వెళ్లింది. కాసేపటికి వచ్చే చూస్తే చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు ఘటనస్థలికి చేరుకుని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. మంగళవారం తెల్లవారుజామున కుక్కలు ఓ చిన్నారిని నోట పట్టుకుని వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడక్కడ చిన్నారి మాంసపు ముద్దలు కనిపించాయి. చిన్నారిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల వీధికుక్కల సమస్య పెరిగిపోయిందని స్థానికులు అంటున్నారు.
సంబంధిత కథనం