APSRTC Arunachalam Buses : కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు- ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే
APSRTC Arunachalam Buses : ఏపీఎస్ఆర్టీసీ అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 16 కాకినాడ నుంచి, సెప్టెంబర్ 17 ధర్మవరం డిపోల నుంచి స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి
APSRTC Arunachalam Buses : పుణ్యక్షేత్రం అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అరుణాచలం స్పెషల్ సర్వీసును నడుపుతోంది. కాకినాడ, ధర్మవరం నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా అరుణాచలం సందర్శించేందుకు తీసుకెళ్తుంది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో కాకినాడ నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై) దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 16 (శుక్రవారం) మధ్యాహ్నం 1 గంటకు కాకినాడ బస్ కాంప్లెక్స్‌లో బస్ బయలుదేరుతుంది. కాణిపాకం, శ్రీపురం దర్శనం తరువాత, మరుసటి రోజు ఉదయం అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తరువాత, అరుణాచలేశ్వరుని దర్శనం ఉంటుంది. అనంతరం పెద్ద కంచి మీదుగా శ్రీకాళహస్తి దర్శనం అయిన తరువాత సెప్టెంబర్ 19 రాత్రి పది గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.3,100గా ఆర్టీసీ నిర్ణయించింది. టిక్కెట్టు కావాలనుకునేవారు కాకినాడ బస్సు డిపోను సంప్రదించాలి. టికెట్ బుకింగ్ కోసం మొబైల్ నెంబర్లు 7382910869, 7382910778లను సంప్రదించవచ్చని, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ఎంయూవీ మనోహర్ తెలిపారు.
ధర్మవరం నుంచి స్పెషల్ బస్సు
ఈ నెల 18న పౌర్ణమి సందర్భంగా అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ధర్మవరం డిపో నుంచి ఈ నెల 17వ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసింది. 17వ తేదీ ధర్మవరం బస్ కాంప్లెక్స్‌లో ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది. రానుపోను ఛార్జీలు ఒకరికి రూ.1,400 చొప్పున వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు 6303151302, 9959225859 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం