AP Govt Employees Fight: ఏపీ ఉద్యోగుల్లో కొత్త చిచ్చుకు కారణం ఎవరు? రిజర్వేషన్ల రద్దుపై ఉద్యోగుల ఆగ్రహం..-those ias officers responsible for the friction over the promotion of andhra pradesh government employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees Fight: ఏపీ ఉద్యోగుల్లో కొత్త చిచ్చుకు కారణం ఎవరు? రిజర్వేషన్ల రద్దుపై ఉద్యోగుల ఆగ్రహం..

AP Govt Employees Fight: ఏపీ ఉద్యోగుల్లో కొత్త చిచ్చుకు కారణం ఎవరు? రిజర్వేషన్ల రద్దుపై ఉద్యోగుల ఆగ్రహం..

HT Telugu Desk HT Telugu
Jul 10, 2023 06:21 AM IST

AP Govt Employees Fight: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నత వ్యవహారంలో 20ఏళ్లుగా అమలవుతున్న నిబంధనల్ని పక్కన పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. పదోన్నతుల్లో ప్రస్తుత కేటగరీలను కాకుండా ఇనిషియల్ క్యాడర్‌ను పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఉద్యోగులు భగ్గు మంటున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి

AP Govt Employees Fight: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త రగడ మొదలైంది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేపుడు ప్రస్తుతం పని చేసే స్థానంలో సీనియారిటీని కాకుండా, ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం ఆందోళనకు సిద్ధమయ్యారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల్ని హరించేలా ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళనకు సిద్ధమయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిజర్వేషన్ల అమలులో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం చూపించే నిర్ణయంపై కొందరు ఉన్నతాధికారుల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ వర్గాల్లో చీలిక తీసుకువచ్చేందుకే వక్ర భాష్యాలు చెబుతున్నారని మండి పడుతున్నారు. ఉద్యోగులు రకరకాల డిమాండ్లతో ఉద్యమాలు చేస్తుండటంతో వారి మధ్య చీలిక తీసుకొచ్చే క్రమంలో కొత్త వివాదాన్ని సృష్టించారని ఆరోపిస్తున్నారు.

అసలు వివాదం ఏమిటంటే....

రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద, ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానంలో ఉన్న ఉద్యోగి కొన్నేళ్ల తర్వాత, తన ఉద్యోగంలో పై స్థానానికి ప్రమోట్ అయినపుడు, పదోన్నతి లభించిన తేదీ నుంచి ఆ తర్వాత వచ్చే ప్రమోషన్‌కు సీనియారిటీ పొందడానికి అర్హత పొందుతారు. దీనిని కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీగా పరిగణిస్తారు.

2001లో ఆర్టికల్ 16(4ఏ)కు 85వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా దీనిని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వర్తింప చేశారు. ఈ రాజ్యాంగ సవరణను నాగరాజ కేసులో 2006ల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. అంతకు ముందు 1995లో విర్పాల్ సింగ్ చౌహాన్ కేసు(1995), అజిత్ సింగ్ (1996) కేసుల్లో సుప్రీం కోర్టు పదోన్నతుల్లో ఇనిషియల్ క్యాడర్ సీనియారిటీని అమలు చేయాలని తీర్పులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తింది.

క్యాచ్ అప్ రూల్ థియరీ-ఇనిషియల్ కేడర్ సీనియారిటీ అంటే....

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు చెందిన ఓ వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ కేడర్‌‌లో పనిచేస్తూ, పనిచేసే చోట సీనియారిటీలో ఐదో స్థానంలో ఉంటే , అతని కంటే ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఓపెన్ క్యాటగిరీ, బీసీ క్యాటగిరీలకు చెందిన వారు ఉన్నారని అనుకుందాం. ఆ సమయంలో “సీనియర్ అసిస్టెంట్” క్యాడర్‌లో ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తే ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోతే,ఐదో స్థానంలో ఉన్న రిజర్వుడు అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి. అతని తర్వాత ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్న వారికి ఆ తర్వాత ప్రమోషన్లు లభిస్తాయి. సీనియర్‌ అసిస్టెంట్ నుంచి తర్వాత సూపరింటెండెంట్ స్థానానికి పదోన్నతులు కల్పించాల్సి వచ్చినపుడు తొలుత ప్రమోషన్ లభించిన రిజర్వుడు అభ్యర్థులకు మొదట సీనియారిటీ ఉంటుంది.

సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ పదోన్నతి ఇవ్వాల్సి వస్తే సీనియర్ అసిస్టెంట్లలో సీనియర్లకు మొదటి పదోన్నతి లభించాల్సి ఉంటుంది. ఆ విభాగంలో అప్పటికే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తగినంత ప్రాధాన్యత ఉంటే అప్పుడు అతని మొదటి నియామక తేదీని పరిగణలోకి తీసుకుంటారు. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థికి వచ్చిన సీనియారిటీ రిజర్వేషన్ ద్వారా వచ్చినందున, గతంలో అతను జూనియర్ అసిస్టెంట్‌ క్యాటగిరీలో ఐదో స్థానంలో ఉన్నందున అక్కడి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడాన్నే క్యాచ్ అప్ రూల్ థియరీగా పరిగణిస్తారు.

ఈ విధానంలో తమకు ఎక్కువ నష్టం జరుగుతోందని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో 86వ రాజ్యాంగ సవరణ చేశారు. ఉద్యోగి పని చేసే స్థానంలో సీనియారిటీ కాకుండా అతను ఉద్యోగంలో చేరిన తేదీని పరిగణలోకి తీసుకుని పదోన్నతులు కల్పిస్తే అవకాశాలే దక్కవని ఆందోళనలు జరిగాయి. క్యాచ్ అప్ థియరీ, ఇనిషియల్ క్యాడర్‌ సీనియారిటీల వల్ల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఎక్కువ నష్టం జరుగుతోందని గుర్తించి 2001లో 85వ రాజ్యాంగ సవరణ చేశారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ వర్తించడం ప్రారంభమైంది.

దీని ప్రకారం షరూల్ ఆఫ్ రిజర్వేషన్ష ద్వారా పదోన్నత పొందిన తర్వాత, పదోన్నతి లభించిన తేదీ నుంచి వారికి సీనియారిటీ లభిస్తుంది. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 33కు అదనంగా దీనిని చేర్చారు.

ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే సమయంలో అయా క్యాడర్లలో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిథ్యం లేకపోతే మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అలా కాకుండా తగినంత ప్రాతినిథ్యం ఉంటే వారికి సాధారణ సీనియారిటీ ఆధారంగానే రిజర్వేషన్ వర్తిస్తుంది.

ఇప్పుడు ఆకస్మాత్తగా రిజర్వేషన్ల తుట్టెను ఏపీ ప్రభుత్వం కదపడం వెనుక కుట్ర ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకు రావడానికి ఇలా చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతుల్లో సరైన అవగాహన లేకుండా మధ్య స్థాయి అధికారుల ప్రమేయంతో కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక దురుద్దేశాలు, వివక్ష దాగి ఉన్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కొందరు ఐఏఎస్‌ అధికారులే దీనికి కారణమని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రద్దు చేసిన ఉత్తర్వులు మ‌ళ్ళీ తెరపైకి….

85వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసిన క్యాచ్ అప్ రూల్ థియరీని తిరగదోడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో కొత్త నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నేడు విజయవాడలో నిరసనకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఉత్తర్వులు అమలైతే రాష్ట్రంలో లక్షలాది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతులు వదులుకుని, పాత స్థానాల్లో పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వీసులో చేరిన ప్రతి ఎస్సీ ఉద్యోగిపై ఈ ప్ర‎భావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు, సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులను అర్థం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయకార్యదర్శి విఫలమయ్యారని, కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో, సీనియారిటీ రివైజ్ చేసే సమయంలో సెక్రటేరియట్‌ ఆ ఫైలును ముఖ్యమంత్రికి పంపకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

పాత స్థానాలకు పంపేందుకు ప్రయత్నాలు….

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వారి పాత స్థానాలకు పంపేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి సాధారణ పరిపాలనా శాఖ సన్నాహాలు చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం కీలక నిర్ణయం తీసుకునే సమయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు జిఏడి సర్వీసెస్ సెక్రటరీగా ఉన్న పోలా భాస్కర్‌ను కమిటీలో లేకుండానే నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు తప్పు పడుతున్నారు.

2003లో అప్పటి ప్రభుత్వంలో ప్రారంభమైన విధానాలను 20ఏళ్ల తర్వాత ఏకపక్షంగా తొలగించడం ద్వారా రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కొందరు అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 20ఏళ్లుగా ఉన్న విధానాలను తొలగించడానికి సహేతుకమైన కారణాలు ఏమిటనేది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు కంటెంప్ట్ పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌ రెడ్డి ఓఎస్డీతో పాటు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు సిఎంఓను తప్పు పట్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

2013లో కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ మీద అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకపోవడానికి పాలనా యంత్రాంగాన్ని నడిపించే వారితో పాటు, ప్రభుత్వానికి సలహాలిచ్చే మాజీ అధికారుల సంకుచితత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించే ఇద్దరు కీలక వ్యక్తుల ప్రమేయంతోనే ఈ నిర్ణయాలు గుట్టు చప్పుడు కాకుండా అమలవుతున్నాయని చెబుతున్నారు. ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రిని కూడా కొందరు సలహాదారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కోర్టు తీర్పులు, అశుతోష్ మిశ్రా కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం న్యాయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2022 నవంబర్‌లో కమిటీ ఏర్పాటు చేసింది. మధ్య స్థాయి అధికారులతో కూడిన ఈ కమిటీలో డీఎస్, జేఎస్‌, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ కమిటీ క్యాచ్ అప్ రూల్ థియరీ, ఇనిషియల్ క్యాడర్ థియరీ అమలు చేయాలని 2003 నవంబర్ నుంచి ఇచ్చిన పదోన్నతులు సమీక్షించాలని రిపోర్టును మార్చి నెలలో సిఎస్‌కు సమర్పించింది. డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ స్థాయి ప్రమోషన్లకు ముఖ్యమంత్రి అమోదించాల్సి ఉన్నా సిఎస్ స్థాయిలోనే అమోదించేశారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని ఉద్యోగులు చెబుతున్నారు.

Whats_app_banner