Agri gold Machinery: అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ చోరీ, రూ.20కోట్ల మెషినరీ మాయం, బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు-theft in agrigold food factory loss of machinery worth rs 20 crore suspicions against bank officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agri Gold Machinery: అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ చోరీ, రూ.20కోట్ల మెషినరీ మాయం, బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు

Agri gold Machinery: అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ చోరీ, రూ.20కోట్ల మెషినరీ మాయం, బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు

Sarath chandra.B HT Telugu
Jun 28, 2024 12:42 PM IST

Agri gold Machinery: నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్‌ ఆస్తులు పక్కదారి పడుతున్నాయి.సిఐడి దర్యాప్తు సాగుతుండగానే కోట్లాది రుపాయల విలువైన భూములు, ఆస్తులకు రెక్కలొస్తున్నాయి. దర్యాప్తు బృందం, బ్యాంకు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో కోట్లాది రుపాయల విలువైన మెషినరీ మాయం
అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో కోట్లాది రుపాయల విలువైన మెషినరీ మాయం

Agri gold Machinery: వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. కోట్లాది రుపాయల మెషినరీ మాత్రం మాయమైపోయింది. తొమ్మిదేళ్లుగా సాగుతున్న అగ్రిగోల్డ్ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. వేల కోట్ల రుపాయల ఆర్ధిక నేరానికి సంబంధించిన ఆస్తుల్ని సిఐడి అటాచ్‌ చేసినా వాటిని పరిరక్షించడంలో మాత్రం విఫలమైంది.

yearly horoscope entry point

కొద్ది రోజుల క్రితం విజయవాడలో సిఐడి అటాచ్‌ చేసిన 3వేల గజాల స్థలాన్ని మాజీ మంత్రి తప్పుడు పత్రాలతో కబ్జా చేయడం వెలుగు చూడగా తాజాగా విజయవాడ శివార్లలో కోట్లాది రుపాయల యంత్ర పరికరాల చోరీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైనా దర్యాప్త మాత్రం ముందుకు సాగడం లేదు. అగ్రిగోల్డ్ కేసుల దర్యాప్తు చేస్తున్న అధికారుల పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏం జరిగిందంటే…

దేశ వ్యాప్తంగా మల్టీ లెవల్ మార్కెటింగ్, ఫార్మ్ ల్యాండ్స్‌, రియల్ ఎస్టేట్, అధిక వడ్డీల పేరుతో ఫిక్సిడ్ డిపాజిట్ వ్యాపారాలతో ఐదారు రాష్ట్రాల్లో వేల కోట్ల టర్నోవర్ సాధించిన అగ్రిగోల్డ్ సంస్థ 2014 నుంచి చిక్కుల్లో పడింది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా వ్యాపారం మొత్తం దివాళా తీసే స్థితికి చేరింది.రాష్ట్ర విభజన నేపథ్యంలో భూముల విలువ ఒక్కసారిగా పడిపోవడం కూడా అగ్రిగోల్డ్ సంస్థ నష్టాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ కారణాలు కూడా అగ్రిగోల్డ్ సంస్థను దెబ్బతీశాయి.

2014లో మొదలైన వ్యవహారం పదేళ్లుగా సాగుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన వ్యాపారంలో లక్షలాది మంది డిపాజిటర్లు నిండా మునిగారు. పదివేల లోపు డిపాజిట్లు చేసిన వారికి ప్రభుత్వం డబ్బు తిరిగి చెల్లించినా పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఇంకా ఎదరు చూస్తూనే ఉన్నారు.

అగ్రిగోల్డ్ వ్యవహారంపై పోలీస్ కేసులు మొదలైన తర్వాత ఉమ్మడి ఏపీలో ఉన్న సంస్థ ఆస్తులతో పాటు, డైరెక్టర్లు, ప్రధాన సిబ్బంది పేరిట ఉన్న ఆస్తుల్ని సిఐడి స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో విజయవాడ శివార్లలోని సూరంపల్లిలో ఉన్న అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అందులో కోట్లాది రుపాయల విలువైన మెషినరీ ఉంది. ఫ్యాక్టరీ సిఐడి అటాచ్ చేయడంతో అది మూతబడింది.

బ్యాంకు వేలానికి హైకోర్టు అనుమతి…

అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని సిఐడి అటాచ్‌ చేసిన తర్వాత ఉమ్మడి హైకోర్టులో బ్యాంకులు దాఖలు చేసిన పిల్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన ఆస్తులు, సంస్థల్ని బహిరంగ వేలం ద్వారా వేలం వేసి బకాయిలను రాబట్టుకోడానికి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో వేలం ప్రక్రియ ద్వారా విలువైన ఆస్తుల్ని కొందరు నామమాత్రపు ధరలకే దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 307/1,2,3,4,5లో విస్తరించి ఉన్న అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్ ప్రొడక్ట్స్‌ ఫ్యాక్టరీని సిఐడి అటాచ్‌ చేసి దానిపై ఉన్న రుణాలను వసూలు చేసుకునే అధికారాన్ని యూనియన్ బ్యాంకుకు అప్పగించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు యూనియన్ బ్యాంకు రుణాలను మంజూరు చేసింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో 2019 మార్చి 25న అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్, ఫ్యాక్టరీలను యూనియన్ బ్యాంకు జప్తు చేసింది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని తాళాలు వేశారు. బ్యాంకు స్వాధీనం చేసుకనే సమయానికి అందులో కోట్లాది రుపాయల విలువైన యంత్రాలు, ఇతర సామాగ్రి ఉండిపోయాయి.

ఉద్దేశపూర్వకంగా జాప్యం….

ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న సామానును లెక్కించి అప్పులో జమ చేయాలని కోరినా బ్యాంకు అధికారులు జాప్యం చేశారు. ఆ యూనిట్‌కు సెక్యూరిటీ గార్డులను నియమించి వదిలేశారు.

నాలుగేళ్ల తర్వాత 2023 సెప్టెంబర్ 5వ తేదీన అగ్రిగోల్ద్ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో మెషినరీ లేదంటూ బ్యాంకు అధికారులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో తనిఖీ చేసిన యాజమాన్యం దాదాపు రూ.20కోట్ల రుపాయల విలువైన మెషినరీ మాయమైనట్టు గుర్తించారు.

బ్యాంకు స్వాధీనంలో ఉన్న వస్తువులెలా మాయం అవుతాయని ప్రశ్నించడంతో 2022 డిసెంబర్ 8వ తేదీన గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో యూనియన్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఇచ్చారు.

ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న మూడేళ్ల తర్వాత చోరీ జరిగినట్టు ఫిర్యాదు చేయడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకు బకాయిలను రాబట్టుకోడానికి అధికారులు ఆసక్తి చూపించకపోవడం, భారీ చోరీ వ్యవహారాన్ని వెలుగు చూడకుండా తొక్కిపెట్టడంతో అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సిఐడి అటాచ్‌మెంట్‌‌తో పాటు, బ్యాంకు స్వాధీనంలో ఉన్న కోట్లాది రుపాయల విలువైన యంత్ర సామాగ్రిని ఎలా మాయం చేశారనేది అంతు చిక్కడం లేదు.

బ్యాంకు అధికారులు రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా పురోగతి లేకపోవడంతో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇటీవల గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనియన్ బ్యాంకు అధికారులతో పాటు అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్లాది రుపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన సిఐడి విలువైన కంప్యూటర్లు, ఫర్నీచర్‌, వాహనాలను ఏం చేశారనే దానిపై ఇప్పటికీ లెక్కలు లేవు. గత ఐదేళ్లలో ఇలాంటి ఆస్తుల్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Whats_app_banner