AP TS Rice Prices: జనవరి నెలాఖరుకు భారీగా పెరుగనున్న బియ్యం ధరలు-the prices of rice will increase by the end of the month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Rice Prices: జనవరి నెలాఖరుకు భారీగా పెరుగనున్న బియ్యం ధరలు

AP TS Rice Prices: జనవరి నెలాఖరుకు భారీగా పెరుగనున్న బియ్యం ధరలు

Sarath chandra.B HT Telugu
Dec 27, 2023 07:07 AM IST

AP TS Rice Prices: తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ఇప్పటికే రోజువారీ ధరల్లో నమోదవుతున్న ధర వ్యత్యాసం జనవరి నెలాఖరుకు భారీగా పెరుగుతాయని మిల్లర్లు అంచనా వేస్తున్నారు.

రికార్డు స్థాయికి చేరుకోనున్న బియ్యం ధరలు
రికార్డు స్థాయికి చేరుకోనున్న బియ్యం ధరలు

AP TS Rice Prices: తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు భారీగా పెరుగనున్నాయి. వరుసగా మూడేళ్లుగా దిగుబడులు తక్కువగా ఉండటంతో పాటు ఈ ఏడాది మిగ్‌జాం తుఫాను దెబ్బకు పంటలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. ఈ ప్రభావం గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మిగ్‌జాం తుఫాను సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది. అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలను తుఫాను ముంచెత్తింది. సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేకపోయారు.

నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్‌ మొదటి వారమంతా ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురిశాయి. మిగ్‌జాం ప్రభావానికి కోతలకు వచ్చిన పంట పూర్తిగా వాలిపోయింది. కొన్ని చోట్ల నీటిలో నాని పోయింది. రోజుల తరబడి నీటిలో నాని పోవడంతో పనికి రాకుండా పోయింది.

ఏపీలో ఒక్క కృష్ణా డెల్టా పరిధిలో 13లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా డెల్టా విస్తరించింది. మిగ్‌ జామ్‌ తుఫాను మొదట తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. తుఫాను తీరం దాటిన తర్వాత గోదావరి జిల్లాలు నష్టపోయాయి.ఇలా రాష్ట్రంలో వరి పండించే లక్షల ఎకరాల పంటను నష్టపోయారు. అధికారిక లెక్కల్లోనే లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

అటు తెలంగాణలో కూడా ఖరీఫ్‌లో పంట నష్టం భారీగా ఉందని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో అనివార్యం బియ్యం ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. మిల్లుల్లో ఉన్న ఉన్న ధాన్యం ఐదారు నెలల వినియోగానికి వస్తాయని, అదే సమయంలో ధరలు పెంచక తప్పదని విజయవాడకు చెందిన ఓ మిల్లర్ చెప్పాడు. ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశాలు లేకపోవడంతో ధరలు సహ‍జంగానే పెరుగుతున్నాయని చెప్పారు.

గత నెలలో రూ.1400గా ఉన్న 26కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ.1550-1600కు చేరింది. ప్రతి వారం ధరలు పెరుగుతాయని,జనవరి నెలాఖరుకు 26కిలోల బస్తా ధర రూ.2వేలకు చేరొచ్చని హోల్ సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే రబీ పంటపైనే ధరలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెండ్ రకం సన్న బియ్యం ధరలు కిలో రూ.60-62వరకు ధర పలుకుతున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఈ ధరలు రూ.70కు చేరుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత మరో ఐదు రుపాయలకు అటుఇటుగా పెరిగి బస్తా రూ.2వేల రుపాయల వద్ద స్థిరపడుతుందని అంచనా వేస్తున్నారు.

పత్తా లేని సివిల్ సప్లైస్…

మార్కెట్ ధరలు, నిత్యావసర వస్తువుల విక్రయాలపై నియంత్రణ గాలికొదిలేసి చాలా ఏళ్లైంది. ధరల నియంత్రణ, బియ్యం, పప్పు ధాన్యాల వంటి వస్తువుల ధరలపై గతంలో పౌరసరఫరాల శాఖ అజమాయిషీ ఉండేది.ఒక్క సీజన్‌లో పంట నష్టం జరిగితే అమాంతం ధరలు పెంచేస్తున్నా వాటిని నియంత్రించే చర్యలు మాత్రం కొరవడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ధరల నియంత్రణ కట్టడి చర్యలు లేకపోవడంతో మిల్లర్లు నిర్ణయించిందే ధర అవుతోంది.

Whats_app_banner