AP Home Minister: హోంమంత్రి పదవి సరే.. అనితకు అధికారం దక్కుతుందా? పాత మంత్రుల బాటలోనే సాగుతారా?-the post of home minister is ok will anita get the power ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Home Minister: హోంమంత్రి పదవి సరే.. అనితకు అధికారం దక్కుతుందా? పాత మంత్రుల బాటలోనే సాగుతారా?

AP Home Minister: హోంమంత్రి పదవి సరే.. అనితకు అధికారం దక్కుతుందా? పాత మంత్రుల బాటలోనే సాగుతారా?

Sarath chandra.B HT Telugu
Jun 15, 2024 10:19 AM IST

AP Home Minister: ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖకు మహిళ మంత్రుల ఆనవాయితీ కొనసాగుతోంది. గత ప్రభుత్వాల బాటలో పేరుకే హోంమంత్రి పదవి, అధికారాన్ని మరోచోట కేంద్రీకరిస్తారో లేదోననే చర్చ సాగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపీ హోంమంత్రి అనిత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపీ హోంమంత్రి అనిత

AP Home Minister: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖకు వరుసగా మూడోసారి మహిళను మంత్రిగా నియమించారు. ఏపీలో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ శాఖను నిర్వహించిన వారు ఎవరు సొంత ముద్ర వేయలేకపోయారు. గత ఐదేళ్లలో దళిత మహిళలకు హోం శాఖ దక్కినా అధికారాన్ని మాత్రం మరో చోట ఉండేది. 

ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతల్ని మహిళకు అప్పగించారు. ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుచరితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. 2022 లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తానేటి వనిత హోంశాఖ బాధ్యతల్ని నిర్వహించారు. మూడోసారి కూడా మహిళకే హోంశాఖ బాధ్యతలు దక్కాయి.టీడీపీలో కీలకమైన మహిళా నాయకురాలు అనితకు హోంశాఖ బాధ్యతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు. లా అండ్‌ ఆర్డర్ బాధ్యతలు మాత్రం ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉండనున్నాయి. 

మంత్రి పదవితో పాటు అధికారం కూడా దక్కుతుందా?

రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం మంత్రి అంటే అత్యంత శక్తివంతమైన శాఖ అనే భావన ఉండేది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖను వైఎస్సార్ హయంలో సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. అప్పట్లో హోంశాఖ మీద ఇతరులకు పట్టు లేకుండా చేయడానికే మహిళకు బాధ్యతలు అప్పగించారనే విమర్శలు వచ్చాయి. పేరుకు సబితాను హోంమంత్రి చేసినా పెత్తనం మొత్తం వైఎస్‌ చేతుల్లో ఉంచుకోడానికే సబితకు హోంశాఖను అప్పగించారని కాంగ్రెస్‌ సీనియర్లు గుర్రుమన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైఎస్సార్ మృతి చెందడంతో హోంశాఖ మొత్తం సబిత గుప్పెట్లోకి వచ్చింది.

వైఎస్‌ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన రోశయ్య ప్రభుత్వంలో, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో సబిత తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. సబిత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె కుమారుడు చెలరేగిపోయారనే ఆరోపణలు వచ్చిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏమి చేయలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో హోంశాఖ మీద పట్టు నిలుపుకున్న మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొదట నాయిని నర్సింహారెడ్డి, తర్వాత మహమూద్‌ అలీ కూడా పేరుకే హోంమంత్రులుగా ముద్ర వేసుకున్నారు. అధికారం మొత్తం కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నారు. 

విభజన తర్వాత…

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్పకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు.టీడీపీ సీనియర్‌ నాయకుడు, సౌమ్యంగా ఉండే చినరాజప్పకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. పదవిలో ఉండగా సొంత నియోజక వర్గంలో సిఐలను కూడా బదిలీ చేయించుకోలేక పోయారనే విమర్శలు చినరాజప్పపై ఉండేవి. హోంశాఖ మంత్రిగా శాఖపై పట్టు కోసం ఎనాడు ఆయన పాకులాడలేదు.హోంశాఖ అధికారం మొత్తం మరో చోట కేంద్రీకృతమైందనే ప్రచారం ఉన్నా చివరి వరకు అలాగే వ్యవహరించారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేకతోటి సుచరితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. పేరుకు మంత్రిగా సుచరిత ఉన్నా కనీస గౌరవానికి కూడా ఆమె నోచుకోలేదు. సిఐలు, ఎస్సైల బదిలీలు కూడా సజ్జల కనుసన్నల్లో జరిగేవి. ఓ దశలో సుచరిత అసమర్థురాలనే ప్రచారాన్ని వైసీపీ నాయకులే ప్రచారం చేశారు. హోంశాఖలో అధికారుల బదిలీలకు సుచరిత భర్త ప్రయత్నించారని, ప్రభుత్వ పెద్దలు మందలించారని కథనాలు తెరపైకి తెచ్చారు.

జాగిలాల శిక్షణకు అతిథిగా…

ఆ తర్వాత ఆమె స్థానంలో తానేటి వనితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. హోంశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ శాఖపై సమీక్ష జోలికే వెళ్లని మంత్రిగా వనిత గుర్తింపు తెచ్చుకున్నారు. తీవ్రమైన నేరాలు, దారుణ ప్రమాదాలు జరిగినా అందరి కంటే ఆఖర్లో నింపాదిగా స్పందించేవారు. ఆ శాఖతో తనకు సంబంధం లేదు అంతా తాడేపల్లి నుంచి చూసుకుంటారన్నట్టు మంత్రిగా వనిత వ్యవహారం సాగేది. నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటే చాలన్నట్టు చివరి రోజు వరకు ఆమె పని తీరు సాగింది.

పోలీస్ జాగిలాల శిక్షణా కార్యక్రమాలకు మాత్రం తానేటి వనిత తప్పనిసరిగా ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హోంమంత్రిని ఏనాడు ఖాతరు చేసిన దాఖలాలు లేవు. దళిత మంత్రి కావడంతో ఆమెపై చిన్నచూపు ఉండేదని, దళితులకు హోం శాఖ బాధ్యతల్ని అప్పగించామని ప్రచారం చేసుకున్నా అధికారాన్ని ఇవ్వలేదనే విషయం విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఎన్నికల్లో వనిత ఘోర పరాజయానికి కూడా ఇదొక కారణమైంది.

అనితకు అధికారం దక్కుతుందా?

టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఐదేళ్లు తీవ్ర నిర్బంధాలను, అవమానాలను వనిత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యారు. అసభ్య దూషణలు, అశ్లీల చిత్రాలతో ప్రత్యర్థులు ఆమెను ట్రోల్ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి బాధ్యతల్ని వనితకు అప్పగించడంతో ఆమెకు డిపార్ట్‌మెంట్‌లో ఏ మేరకు అధికారం లభిస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. గతంలో చినరాజప్ప మాదిరి ఆమె తన పరిధికి పరిమితం అవుతారా? శాఖపై పట్టు సాధిస్తారా అనేది చూడాలి. sarath

WhatsApp channel

సంబంధిత కథనం