GO 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్‌ వైద్యులతో చర్చలు సఫలం-the government backed down on the implementation of go 85 the discussions of the service doctors were successful ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Go 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్‌ వైద్యులతో చర్చలు సఫలం

GO 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్‌ వైద్యులతో చర్చలు సఫలం

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 19, 2024 05:42 AM IST

GO 85 Reversion: ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 85పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వైద్యుల ఆందోళనతో రాష్ట్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. పీహెచ్సీ డాక్ట‌ర్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌రం మేర‌కు జీఓ 85 స‌వ‌ర‌ణ‌కు అంగీకరించింది.

ఇన్‌ సర్వీస్ కోటా రిజర్వేషన్ల కుదింపుపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
ఇన్‌ సర్వీస్ కోటా రిజర్వేషన్ల కుదింపుపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

GO 85 Reversion: పీజీ వైద్య విద్య‌లో ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వ పీహెచ్సీ డాక్ట‌ర్ల డిమాండ్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. ప్ర‌భుత్వం, పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల మ‌ధ్య బుధ‌వారం నాడు స‌చివాల‌యంలో సుహృద్భావ వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. వైద్య, ఆరోగ్య శాఖ మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, డిఎంఇ డాక్ట‌ర్ న‌ర‌సింహం, డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ‌విద్యాల‌యం రిజిస్ట్రార్ డాక్ట‌ర్ రాధికారెడ్డి, పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షుడు డాక్ట‌ర్ యూనిస్ తో పాటు 15 మంది డాక్ట‌ర్లు చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.

ప‌లువురు పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం నాయ‌కులు ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ విష‌యంతో పాటు వారి సేవ‌ల‌కు సంబంధించిన ప‌లు ఇత‌ర డిమాండ్ల‌ను స‌మావేశంలో వివ‌రించారు. ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ కు సంబంధించి ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీఓ 85 ఉప‌సంహ‌ర‌ణ‌, స‌మ‌య బ‌ద్ధ ప‌దోన్న‌తులు, నామ మాత్ర‌పు ఇంక్రిమెంట్లు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో ప‌నిచేస్తున్న ఇత‌ర ఎంబిబియ‌స్ డాక్ట‌ర్ల కు అందిస్తున్న ఆర్థిక వెసులుబాటును పీహెచ్సీ డాక్ట‌ర్ల‌కు వ‌ర్తింప‌జేయ‌డం వంటి విష‌యాల్ని వారు ప్ర‌స్తావించారు.

పీహెచ్సీ డాక్ట‌ర్ల డిమాండ్ల‌కు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సానుకూలంగా స్పందించారు. పీహెచ్సీ డాక్ట‌ర్లు పీజీ వైద్య విద్య పూర్తి చేసుకుని 2027లో స‌ర్వీసులో చేరే స‌మ‌యానికి వివిధ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల ఖాళీల ల‌భ్య‌తను దృష్టిలో పెట్టుకుని ఈ సంవ‌త్స‌రం పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు ఆశిస్తున్న డాక్ట‌ర్ల సంఖ్య‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వారికి వీలైనంత మేర‌కు న్యాయం చేయ‌డానికి చిత్త‌శుద్ధితో కృషి చేస్తామ‌ని మంత్రి అన్నారు. ఇందుకోసం జీఓ 85లో స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

2020 నాటికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల ఖాళీల ల‌భ్య‌త, ఈ ఏడాది పీజీ ప‌రీక్ష‌లో అర్హత పొందిన పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఖ్య మ‌ధ్య భారీ వ్య‌త్యాస‌ముంద‌ని, అయినా వారి ఆశ‌ల్ని నేర‌వేర్చ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఈ దిశ‌గా మ‌రోసారి పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి, డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ‌విద్యాల‌యం సీట్ మ్యాట్రిక్స్ ప్ర‌క‌టించేలోగా తుది నిర్ణ‌యాన్ని తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

2021లో పీజీ వైద్య విద్య‌లో క్లినిక‌ల్ సీట్ల‌లో రిజ‌ర్వేష‌న్ ను 30 శాతానికి, నాన్ క్లినిక‌ల్ సీట్ల‌లో 50 శాతానికి పెంచిన గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం రెండేళ్ల‌లోనే దాని ప‌ర్య‌వ‌సానాలను క్షుణ్ణంగా ప‌రిశీలించి, రిజ‌ర్వేష‌న్ శాతంపై త‌గు సిఫార‌సులు చేయ‌డానికి త్రిస‌భ్య కమిటీని నియ‌మించింద‌ని, ఆ క‌మిటీ రిజ‌ర్వేష‌న్ శాతాన్ని స‌గానికి కుదించింద‌ని మంత్రి వివ‌రించారు.

నివేదికలోని అంశాలు ఈ ఏడాది నీట్ పీజీ ప‌రీక్ష జ‌ర‌గ‌డానికి చాలా ముందే బ‌హిరంగ‌మ‌య్యాయ‌ని, అందులోని అంశాలు పీహెచ్సీ డాక్ట‌ర్ల‌కు తెలుసున‌ని మంత్రి వ్యాఖ్యానించారు. జీఓ 85ను పీజీ ప‌రీక్ష‌కు కొద్ది స‌మ‌యం ముందే విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్న పీహెచ్సీ డాక్ట‌ర్ల వ్యాఖ్య‌ల్ని ఆయ‌న ఖండించారు

ఏ స‌మ‌స్య అయినా, ప్ర‌తిష్టంభ‌న అయినా ప‌రిష్కారం కావాలంటే ఇరు ప‌క్షాలూ ప‌ట్టు విడుపు ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి సూచించారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల పోస్టుల ల‌భ్య‌త, నియామ‌కాల‌పై ప్ర‌భుత్వంపై ఉన్న ప‌రిమితుల్ని ఆందోళ‌న చేస్తున్న వైద్యులు అర్ధం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

ఎన్నో ప్ర‌యాస‌ల‌కోర్చి ప్ర‌జ‌ల‌కు పీహెచ్సీ వైద్యులు సేవ‌లందిస్తున్నందున పీజీ వైద్య విద్య ప‌ట్ల వారి ఆశల్ని నెర‌వేర్చాల‌న్న ఆలోచ‌న‌తోనే ప్ర‌భుత్వం జీఓ 85ను స‌వ‌రించ‌డానికి అంగీక‌రించింద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ జీఓలో ప్ర‌స్తావించిన 6 పీజీ కోర్సుల్లోనే కాకుండా అన్ని కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించాల‌న్న వైద్యుల డిమాండ్ ను కూడా సానుకూలంగా ప‌రిశీలించడానికి మంత్రి అంగీక‌రించారు.

ప‌లు డిమాండ్ల‌పై ప్ర‌భుత్వ సానుకూల స్పంద‌న నేప‌థ్యంలో పీహెచ్సీ డాక్ట‌ర్లు త‌మ ఆందోళ‌న కార్య‌క్ర‌మాన్ని విర‌మించుకుని విధుల్లో చేరాల‌ని మంత్రి కోరారు. త్వ‌ర‌లో మ‌రోసారి పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి తుది నిర్ణ‌యాన్ని తీసుకుంటామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు.

క‌నీసం పీహెచ్సీ వైద్యుల‌తో సంప్ర‌దించ‌కుండా ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ ను త‌గ్గించడం వైద్య‌ల్ని ఆగ్ర‌హానికి గురిచేసింద‌న్న వ్యాఖ్య‌కు స్పందిస్తూ, ప్ర‌జాభిప్రాయానికి ఏమాత్రం విలువ‌నివ్వ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆ విధంగా న‌డుచుకుంద‌ని, అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించే కూట‌మి ప్ర‌భుత్వం ప‌లు ద‌ఫాలుగా పీహెచ్సీ వైద్యుల సంఘం నాయ‌కుల‌తో చ‌ర్చిస్తూ వారికి త‌గు మేరకు న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు

భారీ స్థాయిలో పీజీ వైద్య విద్య‌లో ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ క‌ల్పంచ‌డం వ‌ల్ల ఎంబిబియ‌స్ త‌ర్వాత ఉన్న‌త వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌నుకుంటున్న తాజా యువ ఎంబిబియ‌స్ డాక్ట‌ర్లు, వారి త‌ల్లిదండ్రుల నుండి కూడా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని ఈ మేర‌కు ప‌లువురు త‌మ ఆందోళన‌ను త‌మ‌తో పంచుకున్నార‌ని మంత్రి వివరించారు.

Whats_app_banner