Criminal Contempt Issue: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, చర్యలకు దిగిన పోలీసులు?-the ap police has taken action on the orders of the high court against inappropriate comments on judges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Criminal Contempt Issue: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, చర్యలకు దిగిన పోలీసులు?

Criminal Contempt Issue: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, చర్యలకు దిగిన పోలీసులు?

HT Telugu Desk HT Telugu
Sep 28, 2023 10:33 AM IST

Criminal Contempt Issue: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అనుచిత  వ్యాఖ్యలపై చర్యలకు దిగిన పోలీసులు
అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు దిగిన పోలీసులు

Criminal Contempt Issue: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్ నేపథ్యంలో న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పలువురిపై క్రిమినల్ కంటెంప్ట్‌ ప్రొసిడింగ్స్‌ నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో నిందితులకు నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ ఇండియా ప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జితో పాటు హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

yearly horoscope entry point

ఈ నెల 9వ తేదీన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ హైకోర్టులో కొట్టేసిన సందర్భంలో సైతం హైకోర్టు న్యాయమూర్తిని టార్గెట్ చేసుకున్నారు. ఈ పరిణామాలపై రాష్ట్రపతికి సైతం న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. జడ్జిలను కింపరిచిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి సెక్రటేరియట్‌ నుంచి సిఎస్‌కు ఆదేశాలు రావడంతో ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్‌ అభియోగాలను నమోదు చేసింది.

న్యాయమూర్తులు, న్యాయాధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏజీ శ్రీరామ్ దాఖలు చేసిన క్రిమినల్ కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు పిటిషన్‌పై పలువురిపై చర్యలు ప్రారంభించారు. నిందితులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో జవాబు చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఫేస్‌బుక్‌ ఖాతాలను గుర్తించి వారికి నోటీసులివ్వాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. హైకోర్టుకు ఏజీ ఇచ్చిన జాబితాలో మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్‌, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, ఎస్.రామకృష్ణ, టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు గూగుల్ ఇండియా, షేస్‌బుక్‌, ట్విట్టర్ సంస్థలు ఉన్నాయి. హైకోర్టులో ప్రతివాదులుగా పేర్కొన్న వారితో పాటు దాదాపు 150మందిని సైబర్ పోలీసులు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. వీరిలో చాలామందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో తమకు గిట్టని వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థానాల్లో ఉన్న వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటివి సాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న వారిపై చర్యలకు సర్కారు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్‌‌గా పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్ షేక్ ఖాజా హుస్సేన్‌ను నంద్యాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner