Gannavaram : గన్నవరంలో ఉద్రిక్తత.. టీడీపీ కార్యాలయంపై దాడి.. అసలేం జరిగింది ?
Gannavaram :కృష్ణా జిల్లా గన్నవరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ నేతల మధ్య 3 రోజులుగా సాగుతోన్న విమర్శల పర్వం... దాడుల వరకూ వెళ్లింది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వంశీ అనుచరులు.. కారుకి నిప్పంటించారు. ఘటనపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Gannavaram : కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలతో.. గన్నవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు చేసిన విమర్శలు.. దాడుల వరకూ వెళ్లాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు విమర్శలకు ఆగ్రహించిన వంశీ అనుచరులు.. తీవ్రంగా స్పందించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన పలువురు వంశీ అనుచరులు.... కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు పార్టీ కార్యాలయం ఆవరణలోని ఓ కారుకు నిప్పుపెట్టారు. మంటలు ఆర్పేందుకు వస్తున్న ఫైరింజన్లను కూడా అడ్డుకున్నారు. వంశీ ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడులు చేయడమే కాకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది.. ?
రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు... ఎమ్మెల్యే వంశీపై విమర్శలు గుప్పించారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ, చంద్రబాబు పైనే ఆరోపణలు చేస్తావా ? అని మండిపడ్డారు. ఈ విమర్శలపై వంశీ అనుచరులు.. సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తమ నాయకుడినే విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రి ధ్వంసం చేశారు. కార్యాలయ అవరణలో ఉన్న కారుకి నిప్పంటించారు. మరో 2 కార్లు ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో.. టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సీఐ సహా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో.. రహదారికి ఇరువైపులా చేరిన టీడీపీ, వైకాపా శ్రేణులు.. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు.. భారీ సంఖ్యలో గన్నవరం కార్యాలయానికి వస్తున్నారు. దీంతో.. గన్నవరంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
గన్నవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం పై దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్... ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న ఆయన... వైఎస్సార్సీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని... పోలీసు శాఖను మూసేశారా ? లేక వైసీపీలో విలీనం చేశారా ? అని నిలదీశారు. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని..... కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.