Bail For AvinashReddy: అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు-telangana high court granted bail to avinash reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Telangana High Court Granted Bail To Avinash Reddy

Bail For AvinashReddy: అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

HT Telugu Desk HT Telugu
May 31, 2023 11:04 AM IST

Bail For AvinashReddy: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 30లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ అవినాష్ రెడ్డి

Bail For AvinashReddy: ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్‌ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, సిబిఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఏడు సార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఆ తర్వాత రకరకాల కారణాలతో విచారణ వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురికావడంతో పులి వెందుల నుంచి ఆమెను కర్నూలు చికిత్స కోసం తరలించారు. సిబిఐ విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో అవినాష్‌ను సిబిఐ అరెస్ట్ చేయడానికి సిద్దమైందని ప్రచారం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

అవినాష్‌ రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అవినాష్‌ రెడ్డి సిబిఐ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసులో సిబిఐ అవినాష్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ దర్యాప్తు చేస్తోందని తాము వివరించినట్లు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి కోర్టుకు వివరించారు. తమ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసులో అవినాష్ రెడ్డి నేరానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఇప్పటి వరకు సిబిఐ జరిపిన దర్యాప్తులో ఎలాంటి సాక్ష్యాలను సేకరించలేదని, కనీసం వాటిని కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిందని, సాక్ష్యాధారాల ఆధారంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తాము కోరినట్లు చెప్పారు.

అనేక మలుపులు తిరుగుతు వాయిదాలు పడుతూ వస్తున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​‌పై తీర్పు వెలువడింది. తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 19వరకు ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

మరోవైపు అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ సిబిఐ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే వివేకా మరణ వార్త సీఎం జగన్‌కు తెలిసిందని, రహస్య సాక్షి ద్వారా తమకు సమాచారం తెలిసిందని సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అవినాష్‌కు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వివేక హత్య వార్తను అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఏప్రిల్‌ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ తేలిపోయింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్‌ 16న సీబీఐ అరెస్టు చేసి ఆ తర్వాతి రోజున అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీంతో గత నెల 17న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ ఎదుట రోజూ విచారణకు హాజరు కావాలని, దర్యాప్తులో ప్రశ్నలు, సమాధానాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఏప్రిల్‌ 25 విచారణ జరుపుతామని అప్పటి వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాష్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

WhatsApp channel