AP MLC Results: ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ తీన్మార్... వైసీపీ లెక్క తప్పిందా..?-tdp won three graduate mlc seats in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Won Three Graduate Mlc Seats In Andhrapradesh

AP MLC Results: ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ తీన్మార్... వైసీపీ లెక్క తప్పిందా..?

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 07:01 AM IST

Ap Graduate Mlc Election Results: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఫలితాల్లో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీడీపీ. ఏకంగా మూడు స్థానాల్లో గెలిచి… తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ‘వై నాట్ 175’ అంటూ ముందుకెళ్తున్న వైసీపీకి బ్రేక్ లు పడినట్లు అయింది.

మూడు స్థానాలను గెలిచిన టీడీపీ
మూడు స్థానాలను గెలిచిన టీడీపీ

AP Graduate MlC Election Results Updates 2023: ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో భారీ విక్టరీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి.... ఈ ఎన్నికల్లో గటి షాకే తగిలింది. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత.... ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వెనకబడిపోయింది. ఇక అధికార వైసీపీ... తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదే ఊపులో వైసీపీ నేతలు కూడా.... టీడీపీపై మాటల దాడిని పెంచారు. టీడీపీ పని అయిపోయిందంటూ తీవ్రస్థాయిలో కార్నర్ చేశారు. మరోవైపు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్... వై నాట్ 175 అంటూ నేతలకు క్లాసులు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమన్న లెవల్ లో అడుగులు వేస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ లెక్క తప్పింది..! తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా మూడు స్థానాల్లో ఫ్యాన్ పార్టీని ఓడించారు. ఆయా స్థానాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీ... ఘన విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సీట్లను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విక్టరీ కొట్టింది. ఉత్తరాంధ్రకు సంంబధించి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు వచ్చాయి. ఇక గతంలో ఇదే సీటు నుంచి గెలిచిన బీజేపీ పీవీఎన్‌ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11,551 ఓట్లు కావాల్సి ఉండటంతో అధికారులు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం అత్యంత ఆసక్తిని రేపింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయసాధించారు. ఇక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మెజారిటీ సాధించారు.

మరోవైపు పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూల్) ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు హోరాహోరీగా కొనసాగింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికల సంఘం అధికారులు విజేతగా ప్రకటించినప్పటికీ... ఇంకా ధ్రువీకరణపత్రం అందించలేదు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే... మూడు స్థానాలను గెలవటంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పట్టభద్రుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందన్న విషయం ఈ ఫలితాలతో వెల్లడైందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అయిందని... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా ఫలితాలే రాబోతున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా... టీడీపీ విజయాన్ని ఆపలేరని అంటున్నారు.

అంతర్మథనంలో వైసీపీ..!

ఇక రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లు తామే గెలుస్తామన్న ధీమాతో ఉండే వైసీపీ. స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెలిచినప్పటికీ... కీలకమైన పట్టభద్రుల సీట్లను కోల్పోవటం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ ఫలితాలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లే చెప్పొచ్చు. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టినప్పటికీ... ఇలాంటి ఫలితాలు రావటమేంటన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలోని సీటును కోల్పోవటం కూడా ఆ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. విశాఖనే రాజధాని అని చాలా రోజులుగా చెపుతున్న వైసీపీకి... ఈ ఫలితం గట్టి సవాల్ గా మారిందన్న చర్చ గట్టిగా నడుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే... వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎలా సాధ్యమవుతుందన్న చర్చ మొదలైంది.

గ్రౌండ్ అంతా కూడా అనుకూలంగా ఉందనుకున్న వైసీపీకి.. తాజా ఫలితాలు మాత్రం విరుద్ధంగా వచ్చాయి. అయితే ఈ గ్రాడ్యూయేట్స్ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని... వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమే లేదని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు... టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం