TDP Prathipati Son: బోగస్ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల రిమాండ్
TDP Prathipati Son: బోగస్ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది.
TDP Prathipati Son: బినామీ కంపెనీల పేరుతో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ కొనుగోలు చేసినట్లు బోగస్ బిల్లులను సృష్టించి కోట్లాది రూపాయలను ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందిన కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
అవేక్సా కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2017 మరియు 2022 సంవత్సరాలలో అమరావతిలో CRDA పరిధిలో రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి రోడ్లను నిర్మించకుండానే బినామీ కంపెనీల పేరుతో రోడ్ల నిర్మాణానికి మెటిరియల్‌ను ఢిల్లీలో కొనుగోలు చేసినట్లు బోగస్ బిల్లులను సృష్టించినట్లు గుర్తించారు. ఈ బిల్లులతో ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయలను ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ గా పొందినట్లు DGGI (Directorate General of Goods and Services Tax Intelligence)విచారణలో గుర్తించారు.
DGGI రిపోర్ట్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌కు పంపడంతో రిపోర్ట్ ను ఆధారంగా APSDRI విజయవాడ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై మాచవరం పోలీసులు Cr.No: 63/2024 U/S 420,409,467, 471, 477(A), 120(B) R/w 34 IPC గా కేసు నమోదు చేశారు. అవేక్సా కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు అంతా కుమ్మక్కై మోసపూరితంగా రోడ్ల నిర్మాణం చేయకుండా నిర్మాణం చేసినట్లుగా దొంగ బిల్లులను సృష్టించి ఆబిల్లులను ఉపయోగించి మారుమూల గ్రామాలలో బ్యాంకులలో అకౌంట్లను తెరిచి వాటిని ఉపయోగించి షెల్ కంపెనీల ద్వారా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసి కోట్లాది రూపాయలను ప్రభుత్వ ఖజానాకు గండికోట్టారని పోలీసులు ప్రకటించారు.
ఈ కేసులో ముద్దాయిగా అవేక్సా కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అడిషనల్ డైరెక్టర్ ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేసినట్లు విజయవాడ సీపీ ప్రకటించారు. నిందితుడిని విజయవాడలో న్యాయమూర్తి కరీముల్లా ఎదుట హాజరు పరచడంతో 14రోజుల రిమాండ్ విధించారు.
ఏమి జరిగిందంటే….
రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరుతో రూ.66.03 కోట్ల ప్రజాధనం దారి మళ్లించినట్టు పోలీసులు చెబుతున్నారు. టీడపీ నేత ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులు కొల్లగొట్టారని పోలీసులు పేర్కొన్నారు. షెల్‌కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించారు.
కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్‌ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయట పడింది. కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారు.
ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచిలు ఉన్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు.
దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఇన్‌పుట్ టాక్స్ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. దీంతో అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్‌ఐ దృష్టిసారించాయి. కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో వ్యవహారం వెలుగు చూసింది.
సబ్ కాంట్రాక్టుల పేరిట పనులు…
2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో సబ్ కాంట్రాక్టుల పేరుతో పనులు తీసుకుంది. ఈ పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుందని పోలీసులు అభియోగాల్లో పేర్కొన్నారు.
సీఆర్‌డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అవెక్సా సంస్థ తానిషా ఇన్‌ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు కాగితాలపై చూపించారు. సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్‌ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్‌లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా మోసానికి పాల్పడ్డారు.
ఈ మేరకు ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము తీసుకున్నారు. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకున్నారు. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలుగా దర్యాప్తులో గుర్తించారు. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించినట్లు పోలీసులు తేల్చారు. .
పనులు చేయకుండానే బిల్లులు….
అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకున్నా ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని తేల్చారు.
రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్‌ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించారు. క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్‌పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ - స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించారు. ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 ప్రభుత్వం నుంచి తీసుకున్నారు.
ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొంది ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఇందుకోసం ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్‌లు, బిల్లులు సమర్పించారు. అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66కోట్ల రుపాయల్ని ప్రభుత్వ నిధులతో పాటు ఇన్‌ఫుట్ టాక్స్ రూపంలో కొల్లగొట్టినట్టు తేల్చారు.
కక్ష సాధింపులో భాగమేనన్న చంద్రబాబు…
మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయి. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh State Directorate of Revenue Intelligence ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, APSDRI ఎందుకు ఏర్పడింది...దాని అసలు లక్ష్యాలేమిటి.? మూడేళ్లుగా వాళ్ళు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారు అనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు APSDRI ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోంది. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు చేస్తోందన్నారు. APSDRI బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? అన్నారు. ఈ వ్యవహారంలో అధికారులు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.