CRDA R5 Zone: రాజధానిలో ఇళ్ల కేటాయింపుపై రగడ..గెజిట్ రద్దు చేయాలని పిటిషన్
CRDA R5 Zone: రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించిన గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సిఆర్డీఏ పరిధిలో కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన గెజిట్‌ను అమలు చేయకుండా ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూములు ఇచ్చిన ఉద్దేశానికి భిన్నంగా గెజిట్ జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు.
CRDA R5 Zone: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 21న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన నందకిశోర్ ప్రభుత్వ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసి, ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణాయపాలెం గ్రామ కార్యదర్శి, కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సీహెచ్ నాగశ్రీనివాస్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
'విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల పరిధిలో పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో రాజధాని కోసం సమీకరించిన 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు జోనల్ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలు జోనల్ పరిధిని కుదించడమేనని భావించింది.
రాజకీయ అజెండా అమల్లో భాగంగా రాజధాని ప్రాంతానికి చెందనివారికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏ సవరణ చట్టం తీసుకొచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చే సమయంలో.. జీవో 107ని సవాలు చేస్తూ దాఖలైన పాత కేసులతో పిటిషన్లను జత చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఈ పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయి. దీనిని అవకాశంగా తీసుకుని ప్రభుత్వం ప్రస్తుత గెజిట్‌ను జారీ చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్‌డీఏ పట్టించుకోలేదని, సీఆర్‌డీఏ కమిషనర్, కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి ఈ వ్యవహారంలో దురుద్దేశంతో వ్యవహరించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఆర్5 జోన్ ఏర్పాటుకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన భూములు, మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నగరం స్వతహాగా నిలదొక్కుకోవడానికి, ఆదాయం ఆర్జించేందుకు ఉపయోగపడేవని, రాజధాని అమరావతికి కీలకమైనవని పేర్కొన్నారు.
ఇళ్ల స్థలాల కేటాయింపు కోరుతూ గ్రామస్థుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాకపోయినా పంచాయితీ ప్రత్యేక అధికారి సీఆర్‌డీఏకు ప్రతిపాదన చేశారని, ఆ ప్రతిపాదన అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని ఆరోపించారు. పంచాయతీ రాజ్ చట్ట నిబంధనల మేరకు ప్రత్యేక అధికారికి.. సీఆర్‌డీఏ తీర్మానంతో సంబంధం ఉండదని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లడంతో, న్యాయస్థానం ఆదేశాలతో సభలు నిర్వహించారని, ఆ సభల్లో ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని చెబుతున్నారు. సీఆర్‌డీఏ అధికారుల మౌఖిక సూచన మేరకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదన చేసినట్లు కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి గ్రామ సభలో చెప్పారన్నారు.
సిఆర్డీఏ చేసిన ప్రతిపాదన వందలమంది రైతుల ప్రయోజనాలు, వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రభుత్వం తరపున సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, గ్రామ సభ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో సీఆర్‌డీఏ విఫలమైందని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడంతో పాటు దానిని రద్దు చేయాలని, నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు సమర్పించిన అభ్యంతరాలు, అధికారుల నిర్ణయానికి సంబంధించిన నోట్‌ఫైల్‌ను తెప్పించి పరిశీలించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
టాపిక్