Visakha Mlc Election: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. చంద్రబాబు నిర్ణయంతో బొత్స ఎన్నిక లాంఛనమే
Visakha Mlc Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.టీడీపీ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుపు లాంఛనం కానుంది.
Visakha Mlc Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావించినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
తాజాగా ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం నామినేషన్ వేయడానికి గడువు కావడంతో పోటీపై పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. పోటీకి దూరంగా ఉండాలని అభిప్రాయాన్ని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు వివరించారు. ఎన్నికల విషయంలో చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారని కూటమి నేతలు ప్రకటించారు. ఉప ఎన్నికలో గెలవాలంటే పెద్ద కష్టం కాదని... హుందాగా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో వివరించారు.
మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లను కాపాడుకుంటున్నారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు ఆగస్టు 30న జరగనున్నాయి.
విశాఖ స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓటమి చెందితే కూటమి ప్రభుత్వానికి తొలి పరాభవం ఎదురైనట్లే అవుతుంది. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జరిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా…. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది. దీంతో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావిస్తోంది.
అఖండ మెజార్టీ తరువాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి భావించినా ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాల్‌గా ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలకం అవుతుంది. ఓటమి పాలైతే దాని ప్రభావం కూడా ఉుంటుంది.
మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం వైసీపీ సవాల్‌గా తీసుకుంది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. గడువులోగా నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.