TDP MLA Akhila Priya : 'నాకూ ఒక రెడ్ బుక్ ఉంది... ఆ 100 మందిని వదిలే ప్రసక్తే లేదు' - అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు-tdp allagadda mla bhuma akhila priya sensational comments about red book ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Mla Akhila Priya : 'నాకూ ఒక రెడ్ బుక్ ఉంది... ఆ 100 మందిని వదిలే ప్రసక్తే లేదు' - అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

TDP MLA Akhila Priya : 'నాకూ ఒక రెడ్ బుక్ ఉంది... ఆ 100 మందిని వదిలే ప్రసక్తే లేదు' - అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 09:13 PM IST

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందని.. అందులో 100 మంది పేర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. లీగల్ గా వారిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు.
భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు.

తన వద్ద కూడా ఒక రెడ్‌ బుక్‌ ఉందంటూ ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆళ్లగడ్డలో ఎవరేం చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డికి సవాల్ విసిరారు.

మూడు రోజుల కిందట ఆళ్లగడ్డ గవర్నమెంట్ కాలేజీని ఎమ్మెల్యే అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

డిగ్రీ కాలేజీ తీసుకువచ్చానని బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవని విమర్శించారు. టాయిలెట్స్ కూడా సరిగా లేవని… స్వీపర్స్ చేయాల్సిన పనులు కూడా విద్యార్థులే చేసుకుంటున్నారని చెప్పారు. పాత బిల్డింగ్ ను ఎంపిక చేసి డిగ్రీ కాలేజీ తెచ్చామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు.

చర్చకు సిద్ధమా..?

“గంగుల బిజేంద్రారెడ్డి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు కేవలం ఓటరువి మాత్రమే. ఓటర్ అంటే దొంగ ఓటర్ వి. నన్ను విమర్శించే అంత స్థాయి నీది కాదు. ఎక్కడో సస్పెండ్ అయి మతిస్థిమితం సరిగా లేని ప్రిన్సిపాల్ ని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేశావు. ఆళ్లగడ్డకు హాస్పిటల్ తెచ్చాను ఊరికే చెప్పడం కాదు కనీసం కాలేజీ బిల్డింగ్ కట్టించావా..?” అని అఖిలప్రియా ప్రశ్నించారు.

ఆళ్లగడ్డలో ఏదో ప్రెస్ మీట్ లు పెట్టి నీచ రాజకీయాలు చేస్తే సహించేదే లేదని అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. “ఇప్పుడు నేను చెప్తున్నా గంగుల బిజెంద్రా రెడ్డి… నీకు దమ్ముంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. మున్సిపల్ ఆఫీస్ లోనే పెట్టిద్దాం. నేనేదో వసూళ్లు చేస్తున్నానని ఆరోపిస్తున్నావ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి. మీడియా సాక్షిగానే అన్ని విషయాలపై మాట్లాడుదాం” అని సవాల్ విసిరారు.

వారిని వదిలే ప్రసక్తే లేదు - అఖిలప్రియ

“ఇప్పుడు చెప్తున్నా ఆళ్లగడ్డలో కొంత మందిని మాత్రం అస్సలు వదలను. నాకు కూడా ఒక రెడ్ బుక్కు ఉంది. అందులో 100 మంది ఉన్నారు. కేవలం ఒకరు ఇద్దర్నీ వదిలేస్తా. మరికొంత మందిని వదలను. అంటే వారిని ఏదో నేను చంపేస్తానని చెప్పటం లేదు. కచ్చితంగా ఆధారాలతో లీగల్ గా చట్టపరమైన చర్యలు తీసుకొని చూపిస్తానని బహిరంగంగా చెబుతున్నాను” అని అఖిలప్రియ మాట్లాడారు.

“మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిపై తప్పుడు కేసులు బనాయించారు.. అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవు. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా…? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అదే తరహాలో ఉంటాను. తప్పకుండా ఆ వంద మందిని వదిలిపెట్టను. లీగల్ గా వారిపై చర్యలు తీసుకునేందుకు పని చేస్తా” అని అఖిలప్రియా చెప్పుకొచ్చారు.

రెడ్ బుక్ పై ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. మంత్రి లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. తాజాగా అఖిలప్రియ రెడ్ బుక్ ను ప్రస్తావించటంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.