Kotabommali Kothammatalli Jatara : ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మత‌ల్లి, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు మహా జాతర-srikakulam kotabommali kothammatalli jatara on oct 1 to 3rd celebrated as state festival ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kotabommali Kothammatalli Jatara : ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మత‌ల్లి, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు మహా జాతర

Kotabommali Kothammatalli Jatara : ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మత‌ల్లి, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు మహా జాతర

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 05:41 PM IST

Kotabommali Kothammatalli Jatara : శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను అక్టోబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. ఈ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మత‌ల్లి, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు మహా జాతర
ఉత్తరాంధ్ర కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మత‌ల్లి, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు మహా జాతర

Kotabommali Kothammatalli Jatara : శ్రీకాకుళం జిల్లాలో అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు కొత్తమ్మ త‌ల్లి జాత‌ర జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే ఈ జాత‌ర‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ జాత‌ర‌కు ఉత్తరాంధ్ర జిల్లాలతో స‌హా మూడు రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో వ‌స్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోట‌బొమ్మాళి కొత్తమ్మత‌ల్లి జాత‌ర‌ను రాష్ట్ర పండ‌ుగ‌గా నిర్వహించేందుకు దేవ‌దాయ‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాత‌ర నిర్వహ‌ణ‌కు రూ.1 కోటి మంజూరు చేసిన‌ట్లు పేర్కొంది. జాత‌ర సంద‌ర్భంగా అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున మంత్రి అచ్చెన్నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారని స్పష్టం చేసింది. ఈ జాత‌ర ఉత్సవాల‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. భ‌క్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

కోరిక‌ల‌ను తీర్చే క‌ల్పవ‌ల్లి

కోట‌బొమ్మాళిలోని కొత్తమ్మ త‌ల్లి ఆలయం శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రతిష్టాత్మక‌మైనది. ప్రతి ఆది, మంగ‌ళ‌, గురువారాల్లో వేలాది మంది భ‌క్తులు అమ్మవారిని ద‌ర్శించుకుంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1925వ సంవ‌త్సరంలో కోట‌బొమ్మాళికి చెందిన క‌మ్మక‌ట్టు చినఅప్పల‌నాయుడు కోట‌బొమ్మాళి మండ‌లం నారాయ‌ణ‌వ‌ల‌స‌లో ప్రతి గురువారం జ‌ర‌గ‌బోయే సంత‌కు ర‌వాణా చేసేందుకు ఎడ్లబండిపై వెళ్లి వ‌స్తూ ఉండేవారు. ఓ రోజు య‌థావిధిగా సంత నుంచి వ‌స్తుండ‌గా మార్గమ‌ధ్యలో ఓ ముతైదువు బండి ఆపి నాయ‌నా ముస‌లిదాన్ని నాకు నీవు వెళ్లే దారిలో న‌న్నుదించేయ‌మ‌ని అడ‌గ్గా అందుకు చిన అప్పల‌నాయుడు స‌రేన‌ని బండి ఎక్కించుకున్నాడు.

వేకువ‌జామున కోట‌బొమ్మాళి గ్రామంలో బండి వ‌చ్చిన దారిలో శ్రీ పట్నాయికుని వెంక‌టేశ్వర‌రావు తోట వ‌ద్దకు బండి రాగానే ఆమె బండిని ఆప‌మ‌ని దేవ‌తామూర్తి స్వరూప‌ముగా దిగి తోట‌లోనికి వెళ్లిపోయింది. దీంతో ఆశ్చర్యపోయిన చినఅప్పల‌నాయుడుకు ఆ రాత్రి క‌ల‌లో ఆమె క‌నిపించి నేను కొత్తమ్మత‌ల్లిని నీకు దారిలో ఆపిన తోట వ‌ద్ద నేను వెల‌సియున్నాను. ప్రతి భాద్రప‌ద మాసంలో వ‌చ్చే పోలాల అమావాస్య త‌రువాత వ‌చ్చిన మంగ‌ళ‌, బుధ వారాల్లో నీ ఇంటి వ‌ద్ద అర్చించి గురువారం నాడు అమ్మవారి జంగిడిను నీ భార్య త‌ల‌పై పెట్టి ప‌సుపు క‌ల‌శాల‌తోనూ, ఘ‌టాల‌తోనూ నృత్య వాయిద్యాల‌తో నా నివాసానికి వ‌చ్చి బ‌లి ప్రాక‌ర‌ణ‌ని చేస్తే నీ కోర్కెల‌ను తీరుస్తాన‌ని చెప్పిన‌ట్లు చ‌రిత్ర చెబుతుంది.

అప్పటి నుంచి ఈ ఉత్సవాల‌ను అత్యంత వైభ‌వంగా జ‌రుపుతున్నారు. కోరిన కోరిక‌ల‌ను తీర్చే క‌ల్పవ‌ల్లిగా పలు రాష్ట్రాల నుంచి భ‌క్తులు చాలా పెద్ద సంఖ్యలో వ‌చ్చి నిలువు కానుక‌లు విరాళాలు ఇచ్చి వారి మొక్కుల‌ను తీర్చుకుంటారు. ఈ మూడు రోజులు భ‌క్తి, సాంస్కృతిక కార్యక్రమాల‌తో ఈ మండ‌లంలో పండ‌ుగ వాతావ‌ర‌ణం నెల‌కుంటుంది.

అంగ‌రంగ వైభ‌వంగా జాతర

జాతర మ‌హోత్సవాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆల‌యానికి రంగులు, బారికేడ్లు, గేట్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌, విద్యుద్దీక‌ర‌ణ‌, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, ప‌గ‌టివేశాలు, వివిధ ర‌కాల ఆట‌ల పోటీలు వంటివి నిర్వహించేందుకు అధికారులు స‌మాయ‌త్తమ‌వుతున్నారు.

ఉత్సవాల పేరిట చందాలు వ‌సూలు చేస్తే చ‌ర్యలు తీసుకుంటామ‌ని, భ‌క్తుల వారికి తోసిన స‌హాయం చేయాలి త‌ప్ప, మొక్కుల చెల్లింపు పేరిట ఎవ‌రి వ‌ద్దా డ‌బ్బులు డిమాండ్ చేయ‌రాద‌ని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. భ‌క్తుల‌కు ఉచిత ద‌ర్శనం క‌ల్పించాల‌ని, నాణ్యమైన ప్రసాదం అంద‌జేయాల‌ని, ప్రత్యేక ద‌ర్శనాల ధ‌ర‌లు కూడా రూ.20, రూ.50 మించి ఉండ‌రాద‌ని తెలిపారు. కొత్తపేట నుంచి కోట‌బొమ్మాళి చివ‌రి వ‌ర‌కు విద్యుత్ దీపాలు అలంక‌రాణ, కొత్తపేట‌, కోట‌బొమ్మాళి ప్రాంతాల్లో బ్లాక్‌టాప్ రోడ్లు, సెంట‌ర్ డివైడ‌ర్ రంగులు, రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియ‌రెన్స్‌తో పాటు ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు.

గాలిగోపురం మ‌ర‌మ్మత్తులు చేయించాల‌ని, అమ్మవారి ఆల‌యానికి రంగులు వేసి సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని అన్నారు. బ‌యో టాయిలెట్ల నిర్వహ‌ణ చేప‌ట్టాల‌ని, ఎగ్జిబిష‌న్‌లో నిర్ణీత ధ‌ర‌లే వ‌సూలు చేయాల‌ని అన్నారు. ఆక‌ట్టుకునే విధంగా సాంస్కృతిక ప్రద‌ర్శన‌లు నిర్వహించాల‌ని, ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. రోడ్లు ప‌క్కన చిరు దుకాణాల ఏర్పాటుకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని, చివ‌రి రోజున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం