Oil Factory Accident : కాకినాడలో ఘోర ప్రమాదం…ఏడుగురి కార్మికుల మృతి-seven daily wage labours killed in edible oil tanker cleaning in kakinada district peddapuram mandal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Oil Factory Accident : కాకినాడలో ఘోర ప్రమాదం…ఏడుగురి కార్మికుల మృతి

Oil Factory Accident : కాకినాడలో ఘోర ప్రమాదం…ఏడుగురి కార్మికుల మృతి

HT Telugu Desk HT Telugu
Feb 09, 2023 11:39 AM IST

Oil Factory Accident కాకినాడ జిల్లా జి.రాగంపేటలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కర్మాగారంలో ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

కాకినాడలో ఘోర ప్రమాదం
కాకినాడలో ఘోర ప్రమాదం

Oil Factory Accident కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట మండలంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేయడానికి లోపలకు దిగిన కార్మికులు ఒక్కొక్కరుగా మృతి చెందారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ట్యాంకుల్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.

ఉదయం ఆరుగంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణకు వచ్చారు. పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. పాడేరుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరి అందకపోవడంతో లోపలకు జారిపోయాడు. అతడిని రక్షించేందుకు వచ్చిన నరసింహ, సాగర్‌‌లు కూడా అపస్మారక స్థితిలోకి చేరడంతో మిగిలిన వారు వారిని రక్షించేూందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు.

మృతులను రామారావు, ప్రసాద్ జగదీష్, వెచ్చంగి సాగర్, బొంజుబాబు, వెచ్చింగి కృష్ణ, వెచ్చంగి నరసింహలుగా గుర్తించారు.మృతుల్లో ఐదుగురిది పాడేరుగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులను పెద్దాపురం మండలం పులిమేరుగా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరికి ఇటీవల వివాహం జరిగినట్లు సహచరులు చెబుతున్నారు.

కంపెనీ యాజమాన్యం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు భారీ పరిణామంలో ఉన్న వంట నూనెల ట్యాంకర్లను శుభ్రం చేసే పనుల్ని పాడేరు, పులిమేరులకు చెందిన వారికి అప్పగించారు. ఒక్కో ట్యాంకర్‌ శుభ్రం చేయడానికి నిర్ణీత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో విషవాయువులు పేరుకు పోవడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ట్యాంకర్లలో ఆక్సిజన్ పరిణామాన్ని గుర్తించకుండా కార్మికుండా కార్మికుల్ని పనిలోకి పురమాయించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలానికి పెద్దాపురం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో జగదీష్‌, ప్రసాద్‌ పులిమేరు గ్రామస్తులుగా గుర్తించారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణం….

కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు. ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి బాధాకరమని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు రాష్ట్రమంతటా జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గతంలో కూడా ఫ్యాక్టరీలో పలు ప్రమాదాలు జరిగినా నిర్లక్ష్యం వీడకపోవడంతో అందుకు కార్మికులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఘటనపై స్పందించాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

పరిశ్రమల మంత్రి ఏపీలో ఉన్నారా…?

రాష్ట్రంలో తరచూ పరిశ్రమల్లో అనూహ్యంగా ప్రమాదాలు జరుగుతున్నా, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అధికారులు వారికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పు పట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, మంత్రులు పరిహారాలుె చెల్లిస్తూ కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ,మంత్రులు, ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం పనితీరు నిర్లక్ష్యం కనపడుతుందని తీవ్రంగా దుయబట్టారు.

Whats_app_banner