Sathya Sai Crime : రూ.10 వేల లంచం ప్రాణం తీసింది-సత్యసాయి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య
Sathya Sai Crime : సత్యసాయి జిల్లాలో లంచం తీసుకుంటా పట్టుబడి, ఆ తర్వాత పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్లు గప్పి పరారైన రిజిస్ట్రార్ చెన్నైలోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు.
Sathya Sai Crime : లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్... అవమానంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. బుక్కపట్నంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42) ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నెల 22న ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ శ్రీనివాస్ నాయక్, ఆ తర్వాత అధికారుల కళ్లుగప్పి పరారయ్యారు. అయితే లంచం తీసుకుంటూ దొరికిన ఆయన.. అవమాన భారంతో చెన్నైలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఓ రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటూ శ్రీనివాస్ నాయక్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ నాయక్ ను విచారించింది. అయితే లంచ్ విరామంలో శ్రీనివాస్ నాయక్ ఏసీబీ అధికారుల కళ్లుగప్పి పరారయ్యారు. దీంతో అధికారులు సబ్ రిజిస్ట్రార్ కోసం గాలించారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ చెన్నైలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసులు సమాచారం అందించారు.
రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన సురేంద్ర రెడ్డి అనే రైతు తన భూమిని మార్చి నెలలో రిజిష్టర్ చేసుకున్నారు. ఇందుకోసం అప్పట్లో రూ.30 వేలు లంచం ఇచ్చినట్లు రైతులు అంటున్నారు. స్టాంప్ డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేశారని, మరో రూ.లక్ష ఇవ్వాలని రైటర్ శ్రీహరి రైతు సురేంద్ర రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు రూ.50 వేలకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నెల 16న రైతు సురేంద్ర రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సూచనతో సురేంద్ర రెడ్డి ఈ నెల 22న రూ.10 వేలు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లారు. ఆ డబ్బులు డాక్యుమెంట్ రైటర్ కు ఇవ్వాలని రిజిస్ట్రార్ సూచించారు. ఆ డబ్బులు రైటర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కు అందగానే ఏసీబీ అధికారులు దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ నాయక్ తో సహా రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణ మధ్యలో ఇచ్చిన బ్రేక్ లో సబ్ రిజిస్ట్రార్ అధికారుల కళ్లుగప్పి పరారయ్యారు. అనంతరం చెన్నైలోని ఓ లాజ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య
కాకినాడలో యువ వైద్యుడు నున్న శ్రీ కిరణ్ (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందారు. స్థానిక రాజకీయ నేతల బెదిరింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని కిరణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదంలో స్థానిక నేతలు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.